కర్నూలు
నంద్యాలలో యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ కేశవ్ (33) దారుణ హత్యకు గురయ్యారు. నంద్యాల టూ టౌన్ కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య తన తమ్ముడితో కలిసి ఈ దారుణానికి ఒడి కట్టాడు. స్థానిక టూ టౌన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటసుబ్బయ్య కు గుట్కా మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ యూట్యూబ్ విలేఖరి కేశవ్ ఆరోపణలు చేస్తూ వీడియోలు పెట్టాడు. దీంతో ఈ విషయంలో విచారణ నిర్వహించిన పోలీస్ అధికారులు వాస్తవం అని తేలడంతో కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య ని సస్పెండ్ చేశారు. వీటిని మనసులో పెట్టుకున్న కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య తన తమ్ముడు నానితో కలిసి మాట్లాడుకుందామని కేశవుని ఆదివారం రాత్రి పిలిపించారు. అతను అక్కడికి చేరుకోగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం స్కూ డ్రైవర్ తో కేశవ్ పై దాడికి దిగారు. వీపు వెనక పొడిచారు. దీంతో తీవ్ర గాయమైన కేశవ్ సంఘటన స్థలంలోనే మరణించాడు. ఆ తర్వాత నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలియగానే నంద్యాల టూ టౌన్ సిఐ ఘటనా స్థలికి చేరుకొని వివరాలను సేకరించారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన బాధితులు వెల్లడించిన మేరకు కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, అతని సోదరుడు నాని పై హత్య కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆయన సంఘటన స్థలానికి చేరుకొని స్వయంగా వివరాలు తెలుసుకున్నారు. విషయం తెలియగానే హత్యకు గురైన కేశవ్ కుటుంబ సభ్యులు అందాల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు ఆస్పత్రుల్లో మిన్నంటాయి.