ఓబిసి రాజ్యాంగ సవరణ బిల్లు మద్దతుకు ప్రతిపక్షాలు సుముఖం
న్యూఢిల్లీ ఆగష్టు 9
వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల విషయంలో ఆయా రాష్ట్రాలకు హక్కు కల్పించే అంశంపై ప్రభుత్వం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నది. ఆ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు ప్రతిపక్షాలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి పెగాసస్ వ్యవహారం, సాగు చట్టాల రద్దు అంశంలో గత రెండు వారాల నుంచి పార్లమెంట్‌లో ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ కూడా విపక్షాలు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం దక్కాలంటే మూడవ వంతు మద్దతు అవసరం. అయితే ఆ బిల్లుకు విపక్షాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో.. బిల్లు పాస్ కావడం అనివార్యమే అవుతుంది. గత రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వరుసగా వాయిదాపడుతున్న విషయం తెలిసిందే.