కల్లోలం సృష్టించనున్న ప్రకృతి వైపరీత్యాలు
న్యూఢిల్లీ ఆగష్టు 9 ఇక నుంచి ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తూనే ఉంటాయని ఈ ఐపీసీసీ రిపోర్ట్ తేల్చి చెప్పింది. పర్యావరణంలో వస్తున్న మార్పులతో మానవాళికి పెను ముప్పు తప్పదని క్లైమేట్ చేంజ్ పై ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్(ఐపీసీసీ) తన తాజా రిపోర్ట్‌లో హెచ్చరించింది. రానున్న రెండు దశాబ్దాల్లోనే భూమి 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత స్థాయిని అందుకుంటుందని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. పర్యావరణ మార్పులకు కర్బన ఉద్గారాలు, మానవాళి చేపడుతున్న కార్యకలాపాలే ప్రధాన కారణాలని నివేదిక తెలిపింది. 2013లో ఇచ్చిన నివేదికకు ఇది కొనసాగింపు. ది సిక్త్స్ అసెస్‌మెంట్ రిపోర్ట్ (ఏఆర్6) క్లైమేట్ చేంజ్ 2021: ద ఫిజికల్ సైన్స్ బేసిస్ పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ పర్యావరణ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్ట్‌ను ఐపీసీసీలోని 195 దేశాల ప్రభుత్వాలు ఆమోదించాయి.. గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీస్ సెల్సియస్‌కు చేరుకుంటే.. వడగాల్పులు, వేసవి కాలం ఎక్కువగా ఉండటం, శీతాకాలం తగ్గడం వంటివి జరుగుతాయి. ఇది 2 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే.. విపరీతమైన వేడిమి మనుషుల ఆరోగ్యంపై, వ్యవసాయంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తుంది. వందేళ్ల కిందటితో పోలిస్తే దశాబ్దంలో ఒకసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు 1.3 రెట్లు పెరిగాయి.21వ శతాబ్దంలో సముద్ర మట్టాలు పెరగడం ఇలాగే కొనసాగి.. తీర ప్రాంతాల ముప్పు ముంపు పెరుగుతూనే ఉంటుందని ఈ రిపోర్ట్ తెలిపింది. సముద్ర మట్టాలు పెరగడం, తీరం కోతకు గురవడం వంటివి గతంలో వందేళ్లకోసారి కనిపిస్తే.. ఈ శతాబ్దం ముగిసేనాటికి అది ప్రతి ఏటా కనిపించే ప్రమాదం ఉన్నదనీ హెచ్చరించింది.పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవాళి మనుగడం ప్రశ్నార్థకం కానుందని ఈ ఐపీసీసీ నివేదిక తేల్చి చెప్పింది. తరచూ ప్రకృతి వైపరీత్యాలతో భూమి అతలాకుతలం కానుందని హెచ్చరికలు జారీ చేసింది. భూమి ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ పెరిగితే.. ప్రతి ఒకటి లేదా రెండేళ్లకు వడగాల్పులు మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. అంతేకాకుండా ధృవప్రాంతాల్లో మంచు వేగంగా కరిగి సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగిపోనున్నాయి.గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయడం ద్వారా పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేయవచ్చని ఈ రిపోర్ట్ తెలిపింది. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను జీరోకి తీసుకువచ్చినా గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకు చేరే అవకాశాలు మూడింట రెండు వంతులు ఉంటుంది. ఒకవేళ 2050 నాటికి ఈ లక్ష్యాన్ని సాధిస్తే మూడింట ఒక వంతు అవకాశాలు ఉంటాయి అని ఐపీసీసీ నివేదిక రూపొందించిన వాళ్లలో ఒకరైన డాక్టర్ ఫ్రెడ్రిక్ ఓటో చెప్పారు.ఉద్గారాలను తగ్గించడం ద్వారా గాలి నాణ్యత త్వరగానే మెరుగు పడే అవకాశాలు ఉన్నా.. ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండటానికి 20, 30 ఏళ్ల సమయం పడుతుందని ఈ రిపోర్ట్ తెలిపింది. గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయడానికి కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, ఇతర గ్రీన్‌హౌజ్ వాయువులు వాతావరణంలోకి వెలువడకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నదని ఓటో తెలిపారు.