ప్రజల సమస్యలను గ్రామాలలో ఎక్కడికక్కడే పరిష్కరించాలి
నెల్లూరు జిల్లా చక్రధర్ బాబు
నెల్లూరు
ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే గ్రామాల్లో పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ కె. వి.ఎన్. చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ "స్పందన ప్రజా విజ్ఞప్తుల దినం" నిర్వహించి, ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అంతకుమునుపు జిల్లా కలెక్టర్ స్పందన అర్జీల పరిష్కారం, జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల పై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో , ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించాలని, వాటిని ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మండల, డివిజన్ స్థాయిల్లో ప్రతి ప్రభుత్వ శాఖ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, ఫిర్యాదులను ఎక్కడికక్కడ పరిష్కరించాలన్నారు. చాలామంది ప్రజలు వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని జిల్లా కేంద్రానికి అర్జీలు పట్టుకుని వస్తున్నారని, ఇకపై జిల్లా కేంద్రా నికి రావలసిన అవసరం లేకుండా, అధికారులు ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 22, 396 అర్జీలు రాగా 20, 630 అర్జీలను పరిష్కరించడం జరిగిందన్నారు. వార్డు గ్రామ సచివాలయాలలో అత్యధికంగా 177 అర్జీలు గడువు దాటి ఉన్నాయన్నారు. అలాగే రెవిన్యూ లో 36, పురపాలక పరిపాలనలో 24, మెప్మా, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం లో 11 అర్జీలు చొప్పున గడువు దాటి ఉన్నాయన్నారు. గడువు మీరిన అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం నాణ్యత గా ఉండాలని, ప్రజలకు సరిగ్గా అర్థమయ్యేలా లిఖితపూర్వకంగా సమాధానం తెలపాలన్నారు. అదే అంశంపై మరల ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 623 అర్జీలు రాగా గడువు లోపలే 614 అర్జీలు పరిష్కారం చేసినందులకు అభినందిస్తున్నానన్నారు. చాలా ప్రభుత్వ శాఖలు దివ్యాంగుల సంక్షేమ శాఖకు బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ విషయమై ఇంకా వివరాలు ఇవ్వలేదన్నారు. రోస్టర్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించి సకాలంలో ఖాళీలు భర్తీ చేసేందుకు వివరాలు వెంటనే అందజేయాలన్నారు. సకాలంలో భర్తీ చేస్తే దివ్యాంగుల కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఆదుకున్న వారవుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందు కోసం జాబ్ క్యాలెండర్ పట్ల ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు ఖాళీల గురించి నోటిఫికేషన్లు పంపించి ఖాళీ పోస్టులు భర్తీ అయ్యేలాగా చొరవ చూపాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి ప్రసంగం కోసం జిల్లా ప్రగతి నివేదిక మంగళవారం లోపు అందజేయాలని సూచించారు. జిల్లాలో పంచాయతీ రాజ్, ఉపాధి హామీ, గృహ నిర్మాణం సంబంధించిన పనులు అనుకున్నంత పురోగతి రావడంలేదని ఇకపై ప్రత్యేక అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించి పురోగతి సాధించాలన్నారు. ప్రతివారం సమీక్షలు జరిపినప్పుడు జిల్లా సరాసరి కంటే తక్కువ పురోగతి తో వెనుకబడిన వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎలాంటి కారణాలు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో మంజూరై ఇంకనూ మొదలు పెట్టని పనులను రద్దు చేస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయినా ఇంకనూ మొదలు కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇంకనూ మొదలు పెట్టకపోతే క్షేత్ర అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే పనులు మొదలు పెట్టేలా చర్యలు చేపట్టాలన్నారు.ప్రతి సోమవారం గృహాల లబ్ధిదారులకు తప్పనిసరిగా బిల్లులు చెల్లించాలని తద్వారా వారిని చైతన్యపరిచి పెద్దఎత్తున గృహాలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. మొదలైన అన్ని ఇళ్ళు సెప్టెంబర్ మాసం కల్లా బేస్మెంట్ లు దాటాలని స్పష్టం చేశారు. ఆప్ కాస్ పొరుగు సేవల ద్వారా ఖాళీలు భర్తీ చేసేటప్పుడు స్పందన అర్జీ లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరు గా తీసుకో రాదన్నారు. సంయుక్త కలెక్టర్ రెవెన్యూ హరేoదిర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ ల కోసం 72 చోట్ల స్థలాలను శుక్రవారం లోగా సంబంధిత తహసీల్దార్లు ఇంజనీర్లకు అప్పగించాలని సూచించారు. అభివృద్ధి సంయుక్త కలెక్టర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ వైయస్సార్ బీమా లబ్ధిదారులకు బయోమెట్రిక్ చేయించాలన్నారు. మంజూరైన 46 చెరువుల సుందరీకరణ చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి బుధవారం ఎంపీడీవోలు నివేదికలు పంపించాలన్నారు.