గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
గోడు వెళ్లబోసుకున్న రాజధాని ప్రాంత రైతులు
అమరావతి అంటే కేసులు పెడుతున్నారని ఆవేదన
- పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయలేరన్న మాజీ సీఎం
గన్నవరం ఆగస్టు 9 : హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఘన
స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి చంద్రబాబు బయటకు రావడంతోనే కార్యకర్తలు జై చంద్రబాబు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, గన్నవరం ఇన్చార్జి, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ప్రధాన కార్యదర్శి మాజీ
ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబు గన్నవరం విమనాశ్రయానికి వస్తున్నారని తెలియడంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు,
కార్యకర్తలతో పాటు రాజధాని అమరావతి ప్రాంత రైతులు కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు తరలివచ్చారు.
ఈ సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, అమరావతి సాధన సమితి నాయకులు చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేశారు. అమరావతి ఉద్యమాన్ని ప్రారంభించి 600 రోజులు పూర్తయిన సందర్భంగా హైకోర్టు నుంచి మంగళగిరి
పానకాలస్వామి ఆలయానికి ర్యాలీగా వెళ్లనీయకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలిపారు.
అయినప్పటికీ కొంతమంది ర్యాలీగా వెళితే అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారని, మరికొందరిని ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా అడ్డుకోగా, అమరావతి అంటే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ వారు గోడు వెళ్లబోసుకున్నారు.
అయితే, పోలీసులతో అమరావతి ఉద్యమాన్ని ఎవరూ అడ్డుకోలేరని, అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు ఏమాత్రం అధైర్యపడొద్దని చంద్రబాబు చెప్పారు.
రైతుల త్యాగాలతో ఏర్పాటైన రాజధాని అమరావతిని తరలించడం వైసీపీ ప్రభుత్వం వల్లకాదని తెలిపారు. టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రటించారనే అక్కసుతోనే ప్రభుత్వం రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని
విమర్శించారు. అనంతరం చంద్రబాబు రాజమహేంద్రవరం జైలు నుంచి బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పలుకరించారు.
కొండపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారంలో రాజీలేని పోరాటం చేస్తున్నందుకు ఆయనను అభినందించారు. అలాగే జిల్లాలో పార్టీ కార్యక్రమాలపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పెడన
ఇన్చార్జి కాగిత కృష్ణ ప్రసాద్ తదితరులను అడిగి తెలుసుకున్నారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు గన్నవరం వచ్చారు. వారితో కూడా చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా, మచిలీపట్నం పార్లమెంటు ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యం రాజు, కార్యదర్శి కొండేటి వెంకటేశ్వరరావు, ప్రచార కార్యదర్శి పీవీ పణికుమార్, తెలుగు మహిళ రాష్ట్ర నాయకులు మూల్పూరి
సాయి కల్యాణి, మండవ లక్ష్మీ, మచిలీపట్నం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ కోనేరు నాని, పార్టీ గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి
బోడపాటి రవి, ఉంగుటూరు మండల అధ్యక్షుడు ఆరుమళ్ల కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనూఖ్, విజయవాడ రూరల్ మండల ఉపాధ్యక్షుడు గుజ్జర్లపూడి బాబురావు, ప్రధాన కార్యదర్శి కోనేరు సందీప్, తెలుగు రైతు బాపులపాడు మండల
అధ్యక్షుడు మొవ్వా వెంకటేశ్వరరావు, తెలుగు యువత గన్నవరం మండల అధ్యక్షుడు చీమలదండు రామకృష్ణ, టీఎన్ఎస్ఎప్ మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు నిమ్మగడ్డ సాయి, తెలుగు మహిళ గన్నవరం మండల అధ్యక్షురాలు చిక్కవరపు
నాగమణి, నాయకులు నిమ్మకూరి మధు, వల్లూరు కిరణ్, పీ కిరణ్ తదితరులు ఉన్నారు.