టాలీవుడ్ గాడ్ ఫాదర్ స్వర్గీయ దాసరి నారాయణరావు పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా లెజెండరీ దర్శకుడి పుట్టిన రోజును పురస్కరించుకుని మే 4 తేదీని డైరెక్టర్స్ డేగా ప్రకటించింది తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా దర్శకరత్న దాసరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్స్‌ని పోస్ట్ చేశారు సెలబ్రిటీలు.. ఈ సందర్భంగా దాసరిని గుర్తు చేసుకుంటూ ఆయన గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. దర్శకరత్న దాసరి నారాయణ రావు సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే నాటకాలపై అభిమానం పెంచుకున్న దాసరి క్రమంగా సినిమాల వైపు అడుగులేశారు. మద్రాస్‌లో ఆదుర్తి సుబ్బారావు దగ్గర శిష్యరికం చేసిన దాసరి కె. విశ్వనాథ్, బాలచందర్, రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాలకు భిన్నంగా సినిమాలు తీశారు. సామాజిక అంశాలనే ఇతివృత్తాలుగా చేసుకున్నారు. సినిమా అనే మాధ్యమం ద్వారా అవినీతి, లింగ వివక్ష, అణచివేత లాంటి అంశాలపై అనేక ప్రశ్నలు సంధించారు. ‘రెడ్డీ గారూ.. నాయుడు గారు.. మీ పేర్ల చివర ఆ తోకలెందుకూ.. ఈ ఊరి చివరే మా పాకలెందుకూ’ అంటూ ఆయన ప్రశ్నించిన తీరు ఎప్పటికీ మరచిపోలేం.