YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పులిచింతల.. తీరెదెప్పుడు

పులిచింతల.. తీరెదెప్పుడు

గుంటూరు, ఆగస్టు 10, 
పులిచింతల డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. అంతే అటు విపక్షానికి కొత్త అస్త్రం దొరికింది. చూశారా నాసిరకం నిర్మాణాలు అంటూ గగ్గోలు మొదలైంది. అంతే స్థాయిలో అధికారపక్షం విపక్షంపై విరుచుకుపడుతుంది. డ్యామ్ లోపాలపై మీ హయాంలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోకపోవడం వల్లే గేటు కొట్టుకుపోయింది అంటూ ఎదురుదాడి. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా ప్రాజెక్ట్ ల వంటి అంశాల్లో విమర్శలకన్నా జరగాలిసిన పని పక్కకు పోతుంది. పులిచింతల తాము అంటే తాము నిర్మించాం అని గొప్పలు పోయిన ఏపీలోని ప్రధాన పార్టీలు గేటు కొట్టుకుపోయాక ఆ తప్పు మీ వల్లే కాదు మీ వల్లే అంటూ ఒకరిమీద మరొకరు అభాండాలు వేసుకోవడం గమనార్హం.జరిగిన ప్రమాదం ఎలానూ జరిగి పోయింది. తక్షణం దృష్టి పెట్టాలిసిన అంశాలు చాలానే ఉన్నాయి. ఇది ఒక్క పులిచింతల సమస్యే కాదు. చంద్ర బాబు సమయంలోను చాలా ప్రమాదాలు సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో జరిగాయి. అప్పుడు కూడా వైసిపి ఇదే ధోరణి తో విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది. ఇప్పుడు టిడిపి అదే పంథా లో సాగుతుంది. ప్రభుత్వాలు మారినా మారకపోయినా అధికారులు ఉన్నవారే ఉంటారు. ఇలాంటి రాజకీయాల కారణంగా అసలు దోషులు హాయిగా తప్పుకుంటున్నారు.1986 లో వచ్చిన గోదావరి వరదలకు కాటన్ బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతింది. దీన్ని ఆధునీకరించి తిరిగి నిర్మించారు. అయినప్పటికి ఈ బ్యారేజ్ లో అనేక లోపాలు పైన అప్రోచ్ పూర్తిగా అధ్వానం అయ్యి కనిపిస్తుంది. ఇదే రకంగా ప్రకాశం బ్యారేజ్ అంశంలో కానీ, నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలేం డ్యామ్ వంటి ప్రాజెక్ట్ ల నిర్వహణలో అనేక లోపాలతోనే కొనసాగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వీటిపై దృష్టి పెడుతున్న ప్రభుత్వాలు ఆ తరువాత రాష్ట్రానికి అన్నం పెట్టె ప్రాజెక్ట్ ల నిర్వహణ గాల్లోనే పెడుతున్నాయి.నిరంతర పర్యవేక్షణ తో పాటు అత్యాధునిక మార్పులు చేస్తూ సాగునీటి రంగాన్ని కొత్తపుంతలు తొక్కించాలిసింది పోయి కేవలం రాజకీయాల కోసమే ప్రతీ అంశాన్ని వినియోగిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే పక్క రాష్ట్రాలతో జలజగడాలు చాలవన్నట్లు ప్రమాదవశాత్తు జరిగే సంఘటనలను పెద్దవి చేయడం ఏపీ లో రివాజుగా మారడం ప్రజల దౌర్భాగ్యంగానే కనిపిస్తుంది. తక్షణం వరదలు తగ్గాకా రాష్ట్రంలోని ప్రాజెక్ట్ లన్నిటిపై పూర్తిస్థాయి సమీక్ష జరిపి భద్రతాపరంగా ఉన్న లోపాలను గుర్తించి ప్రమాదాలను ముందే అరికట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి.

Related Posts