అదిలాబాద్, ఆగస్టు 10, నీలి విప్లవంలో భాగంగా తెలంగాణ సర్కారు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తూ మత్స్య సంపదను సృష్టిస్తున్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వానకాలం ప్రారంభంలోనే జలవనరుల్లోకి నీరు పుష్కలంగా చేరడంతో అధికారులు భారీగా చేపల పెంపకాన్ని చేపట్టనున్నారు. రెండు జిల్లాల్లో ఏడు ప్రాజెక్టులతోపాటు 935 చెరువుల్లో 6.31 కోట్ల చేప పిల్లలను పెంచడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. నెల 20న చెరువుల్లో వదలడానికి సిద్ధమవుతున్నారు.రాష్ట్రంలో కులవృత్తులకు చేయూతనందించి, వారి ఉపాధిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తూ.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో చేపల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు గ్రామాల్లో ఉపాధి లభించక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఏటా వానకాలంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు నిండినా గత ప్రభుత్వాల సహకారం లేక చేప పిల్లలను పెంచలేని పరిస్థితి ఉండేది. దీంతో కుటుంబాల పోషణ కోసం వివిధ జిల్లాలు, పట్టణాల్లో కూలీలుగా పనిచేస్తూ ఉపాధి పొందేవారు. సమైక్య రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాలకు 50 శాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేసేవారు. కేవలం రూ.25వేల యూనిట్‌ను 50 శాతం రాయితీతో రూ.12,500కు ఇచ్చేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నది. మత్స్యకారులకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మేలురకమైన చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. సర్కారు అందిస్తున్న సాయంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈ సీజన్‌లో కురిసిన వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకున్నాయి. రెండు జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దీంతో అధికారులు ఈ ఏడాది ఎక్కువ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల, మత్తడి వాగు.. నిర్మల్ జిల్లా కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు, పల్సి రంగారావు ప్రాజెక్టు, ఎస్సారెస్పీలో చేపలు వదిలేందుకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 265 చెరువుల్లో 1.32 కోట్లు, నిర్మల్ జిల్లాలో 672 చెరువుల్లో 4.99 కోట్ల చేప పిల్లలను పెంచనున్నారు. చెరువుల్లో నీటి లభ్యత, చేప పిల్లల పెరుగుదలకు అనుగుణంగా కట్ల, రోహు, మృగాల వంటి చేప పిల్లల వదలనున్నారు. చెరువుల్లో 25-40 ఎంఎం, ప్రాజెక్టుల్లో 80-100 ఎంఎం చేప పిల్లలను వేయనున్నారు. చేపల పెంపకాన్ని పారదర్శకంగా చేపట్టడానికి అధికారులు జీపీఎస్ విధానం అమలు చేస్తున్నారు. పంపిణీకి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు ఎక్కువగా ఉండడంతో చేపలు బాగా పెరిగి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి.