YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

టూ లెట్ ప్రకటనలపై సైబర్ నేరగాళ్లు కన్ను

 టూ లెట్ ప్రకటనలపై సైబర్ నేరగాళ్లు కన్ను

హైదరాబాద్, ఆగస్టు 10, 
దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లు ఉంది సైబర్‌నేరగాళ్ల తీరు. దోచుకునేందుకు ఎన్ని మార్గాలు ఉంటాయో అన్నింటిని ఉపయోగించుకుంటున్నారు. టెక్నాలజీతో కోట్లు కొల్లగొడుతున్నారు. వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్న వీరు.. ఇప్పుడు అద్దె ఇండ్లపైనా.. కన్నేశారు. ఇంటి యజమానులను టార్గెట్‌ చేసి.. అడ్వాన్సు పేరిట ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కరోనా దెబ్బతో శివారు ప్రాంతాల్లో చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోవడంతో అనేక ఇండ్ల ముందు టు లెట్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాటి ద్వారా నెలకు వచ్చే ఆదాయంతో కొందరు ఇంటి రుణానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించేవారు. మరికొందరు కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇంకొందరు వివిధ అవసరాలకు వాడుకునే వారు. ఇప్పుడు ఇండ్లు ఖాళీగా ఉండటంతో రాబడి తగ్గిపోయింది. దీంతో ‘మా ఇళ్లు ఖాళీగా ఉంది సంప్రదించగలరు. అన్ని సౌకర్యాలు కలవు’ అంటూ.. వివిధ పత్రికలు, ఓఎల్‌ఎక్స్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియా వేదికలపై వీడియోలు, ఫొటోలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రకటనలపై నజర్‌ పెట్టిన సైబర్‌నేరగాళ్లు తమదైన శైలిలో ఇంటి ఓనర్లను దోచుకుంటున్నారు.ఇల్లు అద్దెకిస్తామని ప్రకటనలిస్తున్నారా?.. జర జాగ్రత్త.. ఆగంతకులు ఎవరైనా ఫోన్లు చేసి.. క్యూ ఆర్‌ కోడ్‌ లేదా యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయించి.. అడ్వాన్సులుపంపిస్తున్నామంటే.. అస్సలు నమ్మకండి..అది సైబర్‌ నేరగాళ్ల పన్నాగమని గ్రహించాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఎల్బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇల్లు ఖాళీగా ఉందని, అద్దెకు కావాలనుకున్న వారు సంప్రదించవచ్చని ఓఎల్‌ఎక్స్‌లో ఫోన్‌ నంబర్‌, అద్దెకు ఇచ్చే పోర్షన్‌ గదుల వీడియోలు, ఫొటోలను పెట్టాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి.. ‘సార్‌ మీ ఇల్లు నచ్చింది. అద్దె ఎంత అని అడిగాడు…నెలకు రూ. 13వేలు అని చెప్పాడు. దీనికి సమాధానంగా అవతలి వ్యక్తి..‘అయితే మీకు క్యూ ఆర్‌ కోడ్‌ పంపిస్తున్నా.. అది స్కాన్‌ చేయండి..మీకు అడ్వాన్స్‌ డబ్బులు రూ. 26వేలు వస్తాయి’ అని చెప్పాడు. ఆ కోడ్‌ను స్కాన్‌ చేయగానే..యజమాని ఖాతా నుంచి రూ. 26 వేలు నగదు బదిలీ అయింది. కంగుతిన్న ఓనర్‌ విషయాన్ని అతడికి చెప్పాడు. ‘అలా జరిగిందా..మరో కోడ్‌ను పంపిస్తున్నా.. ఈ సారి రెండు కలిపి మొత్తం నగదు వస్తుంద’ని నమ్మించాడు. అతడు చెప్పినట్లే చేయగా, మరోసారి నగదు పోయింది. అలా సైబర్‌ నేరగాడు ఇంటి యజమాని నుంచి మొత్తం రూ. 80 వేలు కొట్టేశాడు”.ఓఎల్‌ఎక్స్‌, సోషల్‌ మీడియా, పత్రికల్లో వచ్చే క్లాసిఫైడ్స్‌ ప్రకటనల్లో ఉంటున్న చిరునామాలను నిశితంగా పరిశీలిస్తున్న ఆగంతకులు…ఇంటి యజమానులను బుట్టలో పడేస్తున్నారు. మీ ఇంట్లోకి అద్దెకు వస్తామని.. మేము కూడా ఇప్పటి వరకు సమీపంలోనే ఉండే వాళ్లమని.. మీ గృహంలో కిరాయికి వస్తే మా ఆఫీస్‌కు దగ్గరగా ఉంటుందని నమ్మిస్తున్నారు. అడ్వాన్స్‌ను పంపిస్తున్నామని చీటింగ్‌ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిల్లో పదుల సంఖ్యలో ఇలాంటి మోసాలపై ఫిర్యాదులు వస్తుండటంతో ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి క్యూ ఆర్‌ కోడ్‌ను పంపినా, ఫోన్‌ చేసి యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుని పాస్‌వర్డ్‌లు చెప్పమన్నా.. వాటిని అసలు నమ్మవద్దని సూచిస్తున్నారు.

Related Posts