YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సీటీ స్కాన్ పేరుతో దోపిడీ

సీటీ స్కాన్ పేరుతో దోపిడీ

హైద్రాబాద్, ఆగస్టు 10, 
రాష్ట్రంలో కరోనా మహమ్మారిని సొమ్ము చేసుకొనేందుకు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నాయి. సీటీ స్కాన్‌ల నివేదికల పేరుతో భారీ దందా నడిపిస్తున్నాయి. బాధితుల్లో రోగ లక్షణాలు లేకున్నా ఉన్నట్లుగా తప్పుడు సీటీ స్కాన్‌ నివేదికలను తయారు చేస్తున్నాయి. వాటిని చూపి భయపెట్టి రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకొని చికిత్స పేరిట రూ. లక్షలు గుంజుతున్నాయి. అనవసరంగా సీటీ స్కాన్‌లు తీయడమే కాకుండా వాటిని మార్ఫింగ్‌ చేయడంపై బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఆసుపత్రుల చీటింగ్‌ స్కాన్‌లపై దృష్టి సారించిన వైద్య, ఆరోగ్యశాఖ విచారణ జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అటువంటి ఆసుపత్రులను గుర్తించి వాటిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ తరహా ఆసుపత్రులపై కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చినట్లు ఒక వైద్యాధికారి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అనవసరంగా సీటీ స్కాన్‌లు చేస్తున్న ఆసుపత్రులను గుర్తించాలని కూడా వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాల అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.రాష్ట్రంలో కరోనా నిర్ధారణకు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షతోపాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో 23 ఆసుపత్రులు, లేబొరేటరీల్లోనే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా చికిత్సలు చేసే ఆసుపత్రులు మాత్రం వంద వరకు ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగంలో ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలతోపాటు యాంటీజెన్‌ పరీక్షలు చేసేవి మొత్తం 1,100 కేంద్రాలు ఉన్నాయి. పీహెచ్‌సీ స్థాయి వరకు యాంటీజెన్‌ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే అనేక ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేసే అవకాశాలు లేవు. దీంతో తమ వద్దకు వచ్చే బాధితులకు సీటీ స్కాన్లను విరివిగా చేస్తున్నాయి. వాటి ఆధారంగానే కరోనా నిర్ధారణ చేస్తున్నాయి. ఒక్కో సీటీ స్కాన్‌కు రూ. 5–6 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దాంట్లో పీపీఈ కిట్ల ధర కూడా కలిపి వేస్తున్నాయి. అవసరం ఉన్నా, లేకున్నా సీటీ స్కాన్‌ చేయడం తప్పనిసరి చేసిన యాజమాన్యాలు... వాటిని డబ్బు సమకూర్చే యంత్రాలుగా మార్చేశాయి. ఆర్‌టీ–పీసీఆర్‌ కరోనా పరీక్షకు కనీసం 24 గంటల సమయం పడుతుండగా సీటీ స్కాన్‌ ద్వారానైతే ఐదు నిమిషాల్లోనే ఫలితం తెలుసుకొనే వీలుంది. దీన్ని బాధితులు కూడా తక్షణ నిర్ధారణగా భావిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు బాధితులు చేయించుకొనే సీటీ స్కాన్‌లలో ఎటువంటి వైరస్‌ లక్షణాలు కనిపించకపోయినా మార్ఫింగ్‌ చేయడం మొదలు పెట్టాయి. సీటీ స్కాన్‌ తీశాక రిపోర్ట్‌ కాపీని మార్చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా సీటీ స్కాన్‌ ఫిల్మ్‌ను కూడా మార్ఫింగ్‌ చేస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్‌ లేకపోయినా, అటువంటి ఇన్ఫెక్షన్‌ ఉన్న రోగి ఫిల్మ్‌లో మరో రోగి పేరు ఉండేలా చేసి మార్ఫింగ్‌ చేస్తున్నట్లు తేలిందని ఒక వైద్యాధికారి తెలిపారు. పాత ఫిల్మ్‌లలోని తేదీలను కూడా ఆసుపత్రులు మార్చేస్తున్నాయని, ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు చెప్పి బాధితులను ఇన్‌పేషెంట్లుగా చేర్చుకొని రూ. లక్షలు గుంజుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు మరో వైద్యాధికారి తెలిపారు. ఒక కలెక్టర్‌ కుటుంబాన్నే మోసం చేశారంటే పరిస్థితి ఎందాక వచ్చిందో అర్థం చేసుకోవచ్చని, దీనిపై నివేదిక తయారు చేశామని ఒక అధికారి తెలిపారు.

Related Posts