నిజామాబాద్, ఆగస్టు 10,
దోమలను నివారించడానికి వినియోగించే ఫాగింగ్ మిషన్ల కొనుగోళ్లలో చేతివాటం అలస్యంగా వెలుగు చూసింది. సీజనల్ వారిగా పెరిగే దోమలను పోగ ద్వారా చంపడం బల్ధియా, పంచాయతీల విధులలో ప్రధానంగా ఉంటుంది. దానిని కొందరు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. దోమలను చంపేందుకు వాడే ఫాగింగ్ యంత్రాల కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగినట్లు గ్రామమంతా కోడై కూస్తోంది. కామారెడ్డి జిల్లాలో 23 మండలాలు ఉన్నాయి. ఓకే ఒక్క మండలంలో ఇది జరిగిందా లేక మిగితా మండలాల్లో కూడా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో పంచాయతీల వారీగా కొనుగోలు చేసిన ఫాగింగ్ యంత్రాల్లో భారీ అక్రమాలు జరిగాయి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలలోకి వెళితే… పిట్లం మండల వ్యాప్తంగా మొత్తం 26 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం పారిశుద్ద్యం, దోమల నివారణలో భాగంగా దోమల మందు పిచికారి చేయడానికి ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇదే అదునుగా భావించిన పంచాయతీ పాలక వర్గాలు భారీ అవినీతికి తెరలేపాయి. కొనుగోళ్లను అధికారులు టెండర్లు లేకుండా అనుమతి ఇచ్చారు. దీంతో పంచాయతీలలో పాలకవర్గం హస్తలాఘవం ప్రదర్శించారు. అప్పటికప్పుడు కొందరు హైద్రాబాద్ లో కొనుగోలు చేయగా, ఒక మండలంలోని స్థానిక మెడికల్ షాపులో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం వరకు 25 వేలు ఉన్న ఫాగింగ్ యంత్రాల ధరలు ఒక్కసారిగా 75 శాతం పెరుగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.బహిరంగ మార్కెట్లో 25 వేలకు దొరికే ఫాగింగ్ యంత్రాలను 45 వేలకు కొనుగోలు చేసినట్టు రశీదులు పెట్టి ఒక్కో యంత్రంపై 20 వేల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు అరోపణలు ఉన్నాయి. ప్రజాధనంతో గ్రామాలను అభివృద్ది చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఒక చిన్న యంత్రం కొనుగోలు విషయంలో కక్కుర్తి పడితే, సంక్షేమ పథకాల నిధులు ఎలా ఖర్చు చేస్తారో అర్థమవుతుందని కొందరు బహాటంగా విమర్శిస్తున్నారు. నిరంతరం పంచాయతీలపై పర్యవేక్షించవలసిన మండల పంచాయతీ అధికారి నిఘా వైఫల్యం, పంచాయతీల వారిగా జమ, ఖర్చు లెక్కలను తక్షణంగా ఆడిటింగ్ చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం చాలా శోచనీయమని ప్రజలు అంటున్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని పాగింగ్ యంత్రాల వెనకాల జరిగిన అవినీతిని బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.