న్యూఢిల్లీ ఆగష్టు 10
కులం ప్రాతిపదికన జనాభాను లెక్కించాలని ఇవాళ పలు పార్టీలు లోక్‌సభలో డిమాండ్ చేశాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కుల గణన చేయకుంటే.. యూపీలో బీజేపీకి ఓటమి ఖాయమని ఎస్పీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. బిల్లు సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ నేత మాట్లాడుతూ.. ఓబీసీ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ కోటాపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను తొలగించకుండా.. ఎలా ఓబీసీ బిల్లును పాస్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. అత్యధిక సంఖ్యలో ఎంపీలను కూర్చోబెట్టేందుకు సెంట్రల్ విస్టాను కడుతున్నారని, కానీ ఓబీసీలు.. దళితులు, మైనార్టీలను ఎందుకు 50 శాతం కోటాకే కట్టిపడేస్తున్నారని అఖిలేశ్ అడిగారు. ఓ ఓబీసీని సీఎం చేస్తారని హామీ ఇచ్చి.. యూపీలో క్షత్రియుడిని సీఎం చేశారని విమర్శించారు. కుల గణనను చేపట్టి, ఆ వివరాలను బహిర్గతం చేయాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు.కులం ప్రాతిపదికన జనాభా లెక్కించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ బీ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఓబీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఆయన.. అఖిల భారత వైద్య విద్యలో ఓబీసీ కోటా లేదని గుర్తు చేశారు. నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం మళ్లీ ఆ కోటాను తెచ్చిందని, దానికి కృతజ్ఞత చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో కుల గణన కూడా చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.