శ్రీనగర్
జమ్ము కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. కశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్ జమ్ము కశ్మీర్‌లో స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ప్రజాస్వామిక వ్యవస్ధలపై పాలక బీజేపీ దాడి చేస్తోందని దుయ్యబట్టారు. శ్రీనగర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ వంటి చట్టసభలతో పాటు న్యాయవ్యవస్ధపైనా కాషాయ పార్టీ దాడి చేస్తోందని, మీడియా గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు.అంతకుముందు రాహుల్ ఖిర్ భవానీ ఆలయం, హజ్రత్‌బల్ మసీదును సందర్శించారు. ఇక రాహుల్ శ్రీనగర్‌లో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగింంచనున్నారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం రాహుల్ తొలిసారిగా ఇక్కడ పర్యటిస్తున్నారు.