YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రిజ‌ర్వేష‌న్ల‌పై 50 శాతం ఉన్న సీలింగ్‌ను ర‌ద్దు చేయాలి

రిజ‌ర్వేష‌న్ల‌పై 50 శాతం ఉన్న సీలింగ్‌ను ర‌ద్దు చేయాలి

న్యూఢిల్లీ ఆగష్టు 10
లోక్‌స‌భ‌లో ఇవాళ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది. స్పీక‌ర్ ఓం బిర్లా కోరిక మేర‌కు విప‌క్ష స‌భ్యులు స‌భ‌లో నినాదాలు ఆపేశారు. దీంతో ఆ బిల్లుపై చ‌ర్చ మొద‌లుపెట్టారు. మంత్రి వీరేంద్ర కుమార్ ఆ బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఓబీసీ జాబితా తయారు చేసేందుకు రాష్ట్రాల‌కే అధికారం ఇచ్చే రీతిలో ఓబీసీ స‌వ‌ర‌ణ బిల్లును తీసుకువ‌చ్చారు. ఈ స‌వ‌ర‌ణ బిల్లు వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా వైద్య‌విద్య‌లో సుమారు 4వేల మంది ఓబీసీల‌కు సీట్లు ద‌క్క‌నున్నాయి.కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ ఈ నేప‌థ్యంలో లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ.. ఇది కీల‌క‌మైన బిల్లు కాబ‌ట్టే తాము చ‌ర్చ‌లో పాల్గొంటున్నామ‌న్నారు. ఈ బిల్లు పాస్ కావాలంటూ మూడ‌వ వంత స‌భ్యులు కూడా అవ‌స‌ర‌మ‌న్నారు. విప‌క్షాలే స‌భ‌ను అడ్డుకుంటున్నాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంద‌ని, కానీ ప్ర‌జ‌ల బాధ‌ల‌ను వెలుగులోకి తెచ్చేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. రిజ‌ర్వేష‌న్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కీల‌క పాత్ర పోషించింద‌న్నారు. పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం అమ‌లులో రాజీవ్ గాంధీ పాత్ర‌ను ఆయ‌న మెచ్చుకున్నారు. ఓబీసీ జాతీయ క‌మిష‌న్ 2018లో రాష్ట్రాల హ‌క్కుల‌ను తీసుకున్న‌ద‌ని, మీరు చేసిన త‌ప్పునే ఇప్పుడు మ‌ళ్లీ స‌రిదిద్దుతున్న‌ట్లు చెప్పారు. యూపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ బిల్లును తెచ్చిన‌ట్లు అధిర్ ఆరోపించారు.రిజ‌ర్వేష‌న్ల‌పై సీలింగ్‌ను పెంచాల‌ని చాలా రాష్ట్రాలు భావిస్తున్న‌ట్లు కాంగ్రెస్ ఫ్లోర్ లీడ‌ర్ అధిర్ తెలిపారు. కుల వ్య‌వ‌స్థ ఉన్నందు వ‌ల్లే దేశంలో రిజ‌ర్వేష‌న్లు అవ‌స‌రం వ‌చ్చాయ‌న్నారు. అణ‌గారిన వ‌ర్గాల‌ను అభివృద్ధిప‌రిచేందుకు రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌స్థ త‌ప్ప‌ద‌ని అధిర్ తెలిపారు. జ్యోతిరావ్ పూలే గురించి కాంగ్రెస్ నేత మాట్లాడారు. మ‌రాఠా రిజ‌ర్వేష‌న్ల గురించి చెప్పిన అధిర్‌.. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ డిమాండ్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ఆయ‌న కేంద్రాన్ని అభ్య‌ర్థించారు. రిజ‌ర్వేష‌న్ల‌పై 50 శాతం ఉన్న సీలింగ్‌ను ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న కోరారు. అధిర్ రంజ‌న్ మాట్లాడుతున్న స‌మ‌యంలో స‌భ‌లో సోనియా గాంధీ కూడా ఉన్నారు.

Related Posts