న్యూఢిల్లీ ఆగష్టు 10
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ఆ రెండు పార్టీలతో పాటు మొత్తం తొమ్మిది పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం ఫైన్ వేసింది. తమ పార్టీ అభ్యర్థులపై ఉన్న నేర చరిత్రను బయటపెట్టని కారణంగా.. ఆ పార్టీలకు ఫైన్ విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు లక్ష జరిమానా విధించగా.. సీపీఎం, ఎన్సీపీలకు 5 లక్షల ఫైన్ వేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీలు తమ ఆదేశాలు పాటించలేదని కోర్టు పేర్కొన్నది. ఇవాళ ఓ కేసులో సుప్రీం ధర్మాసం.. అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడి ధర్మాసనం మంగళవారం ఆ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని కోసం ఓ మొబైల్ యాప్‌ను డెవలప్ చేసి దాంట్లో క్రిమినల్ రికార్డులను పొందుపరుచాలని కోర్టు ఆదేశించింది.