న్యూఢిల్లీ ఆగష్టు 10
దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్ సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం లేదా సీఏఏకి నిబంధనలు రూపొందించడానికి మరో ఆరు నెలల సమయం కావాలని కోరినట్లు గత నెల పార్లమెంట్‌కు చెప్పింది హోంశాఖ. వచ్చే ఏడాది జనవరి 9 వరకూ దీనికి సమయం ఉంది. ఇక మరోవైపు దేశంలో ఉన్న రోహింగ్యా ముస్లింలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడున్నట్లు వస్తున్న రిపోర్టుల గురించి కూడా హోంశాఖ లోక్‌సభకు వివరించింది.దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. దేశంలోకి అక్రమంగా చొరబడిన వాళ్లను గుర్తించడం, వాళ్లను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం, వాళ్లు బయోగ్రఫిక్, బయోమెట్రిక్ వివరాలను సేకరించడం, వాళ్ల దగ్గర ఉన్న నకిలీ భారత ధృవపత్రాలను రద్దు చేయడం, వాళ్లను దేశం నుంచి పంపించేయడంపై సూచనలు చేసినట్లు హోంశాఖ తెలిపింది. అక్రమ వలసదారుల బయోగ్రఫిక్, బయోమెట్రిక్ వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు, వాళ్లను దేశం నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తొలిసారి హోంశాఖ వెల్లడించింది.