హేమకు ‘మా’షోకాజ్ నోటీసు
హైదరాబాద్ ఆగష్టు 10
:మా’ అసోసియేషన్ ఎన్నికలు వివాదం రోజురోజుకీ ముదురుతోంది. అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న నటి హేమ ప్రస్తుత ‘మా’ ప్రెసిడెంట్ నరేశ్ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తను ఇతర సభ్యులకు పంపిన వాయిస్ మెసేజ్ లీక్ కావడంతో మరోసారి ‘మా’లో మాటల యుద్ధం మొదలైంది. హేమ ఆరోపణలను ‘మా’ అధ్యక్షుడు నరేశ్, కార్యదర్శి జీవిత ఖండించారు. బాధ్యతారహితంగా మాట్లాడి ‘మా’ ప్రతిష్ఠ దిగజారేలా చేసిందని క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆధారాలుగా లీకైన హేమ ఈ మేరకు క్లాస్ 8 బైలాస్ కింద ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీఆర్‌సీకి రాసిన లేఖలో అధ్యక్షుడు పేర్కొన్నారు. మూడు రోజుల్లో హేమ నుంచి సమాధానం రావాలని, అది సంతృప్తికరంగా ఉండాలని డీఆర్‌సీ తెలిపింది. లేని పక్షంలో క్రమశిక్షణా సంఘం నుంచి కఠిన చర్యలు తప్పవని తెలిపింది. ‘మా’ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో చిరంజీవి కూడా స్పందించారు. ‘మా’ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు. మా ఎన్నికలు వెంటనే జరపాలనీ, లేదంటే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోందని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు.