కేంద్రంలో బలంగా ఉన్నది ఎన్డీఏ, యూపీఏలే. బీజేపి హోదా ఇవ్వనంది. కాంగ్రెస్ ఇస్తానంది. హోదా కావాలని నిజాయితీగా కోరే వారు కర్నాటకలో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించాలని ఏపీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తిరుపతి సభలో బిజెపిని ఓడించమన్నారు. కానీ బీజేపీకి మద్దతిస్తున్న దేవెగౌడ తమకు బాబు, కెసిఆర్, ఒవైసీల మద్దతు ఉందని పోస్టర్లు వేసుకున్నారు. దీని అర్ధం ఏమిటో చంద్రబాబు చెప్పాలని రఘువీరా అన్నారు. కాంగ్రెస్ కి ఓటు వద్దని వైకాపా సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఎందుకలా చేయిస్తున్నారో జగన్ చెప్పాలి. కర్నాటకలో బీజేపి ఓడిపోతేనే హోదా ఉద్యమం విజయవంతమవుతుందని అయన అన్నారు. గత నాలుగేళ్లలో జగన్ హోదా సాధనకు ఎన్నో అవకాశాలు జార విడిచారు. ఆయన రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇపుడు పోరాటం అంటే ప్రజలను మభ్యపెట్టటమేనని రఘువీరా వ్యాఖ్యానించారు. దాచేపల్లి అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పాలనలో కఠినంగా నిరోధించాం. ఒకటిరెండు ఎన్ కౌంటర్లు చేస్తేనే భయపడతారని అయన అన్నారు. ఎన్ కౌంటర్ లు మానవ హక్కుల ఉల్లంఘన కాదా అని పాత్రికేయులు రఘువీరాను నిలదీసారు. తాను అలా అనలేదని అయన మాట మార్చారు. దాంతో రికార్డయిన మాటలు వినిపించారు. తాను అన్నది నిజమేనన్న రఘువీరా అయితే ఆ మాటకు కట్టుబడి ఉంటానని అన్నారు.