అనంతపురం, ఆగస్టు 11,
అనంతపురం జిల్లాలో తనకంటూ.. ప్రత్యేక ముద్ర వేసుకున్న జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గం నుంచి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. వరుస విజయాలు.. ఆయనను జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నాయకుడిగా ముద్ర వేసుకునేలా చేశాయి. అయితే.. గత ఎన్నికలకు ముందు.. ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు.. పవన్ రెడ్డిని అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించారు. అయితే.. ఆయన ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి పవన్ ఒకింత యాక్టివ్‌గానే ఉన్నప్పటికీ.. టీడీపీ వ్యవహార శైలిపై జేసీ దివాకర్ రెడ్డి గుస్సాగా ఉన్నారు. తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే తమపై ఉన్న కేసులు, ఇతరత్రా ఆర్థిక లావాదేవీలు వంటి విషయాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలోకి చేరాలని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉంటున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. సీమలో బీజేపీకి సానుభూతి ఉంది. పైగా ప్రత్యేక సీమ ఉద్యమానికి.. ఇక్కడి బీజేపీ నేతలు కొన్నాళ్లు మద్దతు కూడా పలికారు. అదే సమయంలో కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుకు కూడా బీజేపీ మొగ్గు చూపుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ దీనిని చేర్చింది. ఈ క్రమంలో బీజేపికి ఇక్కడ బాగానే ఫాలో అప్ ఉంది. ఈ క్రమంలో బీజేపీలో చేరితే తనకు బాగానే ఉంటుందని జేసీ దివాకర్ రెడ్డి భావించారు.దీనికి సంబంధించి ఆయన నేరుగా కేంద్రంలో ఉన్న పరిచయాల నేపథ్యంలో బీజేపీ పెద్దల ముందు .. ఒక ప్రతిపాదన పెట్టినట్టు కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. రాజ్యసభకు తనను ప్రమోట్ చేయాలని ఆయన కోరుతున్నారు. అయితే.. దీనిపై నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్న బీజేపీ పెద్దల నుంచి తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి ఆసక్తికర సమాచారం వచ్చింది. “పార్టీని డెవలప్ చేయండి.. పదవులు మీరు కోరుకున్నట్టుగానే వస్తాయి. కానీ, ఇప్పుడే కాదు“ అని సీమకు చెందిన కీలక నేత ఒకరు జేసీ దివాకర్ రెడ్డిని కలిసి కేంద్రం నుంచి వచ్చిన సమాచారాన్ని అందించారు. దీనిపై ఇప్పుడు ఆయన తర్జన భర్జన పడుతున్నారు. వయసు రీత్యా చూస్తే.. ఆయనకు తక్షణమే పదవి కావాలనేది ఆయన వాదనగా ఉంది.కానీ, బీజేపీ పరంగా చూస్తే.. చాలా మంది నేతలు పదవుల కోసం లైన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో రాజ్యసభ ఇస్తారనే ఆశ వదులుకుని.. పార్టీలో చేరితే.. ఎప్పటికి గుర్తింపు లభిస్తుందోననిజేసీ దివాకర్ రెడ్డి తర్జన భర్జన పడుతున్నారు. అయితే.. బీజేపీ నేతల మధ్య మాత్రం ఆయన పార్టీలోకి చేరితే.. రెండేళ్లలో ఆయనను గవర్నర్‌గా నియమించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని.. సీమకు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రచారం చేసుకునేందుకు బీజేపీ పెద్దలు ఈ దిశగా కూడా ఆలోచించే అవకాశం ఉందని.. రాజకీయంగా సీనియర్ మోస్ట్ అయిన జేసీ దివాకర్ రెడ్డి వల్ల బీజేపీకి లబ్ధి చేకూరితే.. ఆయన ఎలాంటి పదవినైనా ఇవ్వొచ్చని అంటున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.