రాజమండ్రి, ఆగస్టు 11,
పోలవరం ముంపుపై ఎందుకింత నిర్లక్ష్యమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులపై సోమవారం జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిన ఏ ఒక్క అధికారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఎన్‌జిటి ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘిం చడం సిగ్గు చేటని పేర్కొంది. పోలవరం కాఫర్ డ్యామ్ వల్ల ముంపు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని ఎపి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలవరం ముంపుతో ప్రజలు సర్వస్వం కోల్పోతా రని పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకపోవడంపైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేసు ముగించాలన్న ఆతృత మాత్రమే సిపిసిబి నివేదికలో కనిపించిందే కానీ, చట్టబద్ధంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి కనిపించలేదని ఆగ్రహించింది. తనిఖీలకు వెళ్లిన అధికారులు వాస్తవాలను వెల్లడించడంలో విఫలమయ్యారని, ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడితే ఎలా? అని విమర్శించింది. పర్యావరణ ప్రభావ అంచనాను తూతూ మంత్రంగా చేశారని, మూడేళ్ల నుంచి కాఫర్ డ్యామ్ వల్ల ముంపు జరుగు తున్నా పట్టించుకోకపోవడం దారుణమని ఎన్‌జిటి బెంచ్‌కు పిటిషనర్ పెంటపాటి పుల్లారావు తరపున న్యాయవాది శ్రావన్ కుమార్ నివేదించారు.మడిచర్ల సత్యనారాయణ, జమ్ముల చౌదరయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జిటిలో విచారణ జరిగింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తాత్కాలికమే, పంపులు వేరే చోటుకు తరలించడం లేదా వేలం వేస్తామని ఎపి ప్రభుత్వం నివేదికలో పేర్కొన్న విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావన్ కుమార్ తీసుకెళ్లారు. ప్రాజెక్టు తాత్కాలికమే అయినప్పుడు రైతుల భూములను వెనక్కి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిహారం కింద రూ.2.40 కోట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి చెల్లిం చడానికి బదులు భూములు, ఉపాధి కోల్పోయిన రైతులకు పరిహారంగా చెల్లించాలని కోరారు. కమిటీ సిఫార్సు చేసిన పర్యావరణ పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎపి ప్రభుత్వ తరపున సీనియర్ న్యాయవాది వెంకట రమణి తెలిపారు. డబ్బు డిపాజిట్ చేసేందుకు కొంత సమయం కావాలని కోరారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై వట్టి వసంత కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌జిటి విచారణ జరిపింది. పర్యావరణ రుసుము నామమాత్రంగా ఉందని ఎన్‌జిటి పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బృందం సరిగ్గా నష్టాన్ని అంచనా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు రుజువైనప్పుడు అధికారులపై చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించింది