YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇంచార్జీలతో దేవాదాయ శాఖ

ఇంచార్జీలతో దేవాదాయ శాఖ

విజయవాడ, ఆగస్టు 11, 
ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారులు (ఇఒ) పోస్టులు దశాబ్దాలుగా భర్తీకి నోచుకోకపోవడం ఆ శాఖ పాలిట శాపంగా మారింది. కొత్త రిక్రూట్‌మెంట్‌ లేకపోవడం, ఏళ్ల తరబడి ఇన్‌ఛార్జి ఇఒల పాలనలో ఆలయాలను నెట్టుకురావడం పరిపాటిగా మారింది. దాతలు ఆలయాల నిర్వహణకు పూర్వం ఉచితంగా ఇచ్చిన భూముల ధరలకు రెక్కలు రావడంతో వాటిని రక్షించడం ఆ శాఖ అధికారులకు కత్తిమీద సాములా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500కు పైగా ఆలయాలుంటే ఇందులో గ్రేడ్‌ 1, 2, 3, ఇఒలు పనిచేసే ఆలయాలు 746 ఉన్నాయి. నేటికీ 258 ఆలయాలకు రెగ్యులర్‌ ఇఒలు లేరు. దీంతో కొందరు రాజకీయ నాయకులు, ఆలయాల పాలకమండలి సభ్యులు, అధికారులతో కుమ్మక్కై పలు ప్రాంతాల్లో ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ఇఒ 10 నుంచి 15 ఆలయాలకు ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ శాఖలో వరుసగా ఉన్నతాధికారులు సైతం సస్పెండ్లకు గురవుతుండటం, కొందరు ఉద్యోగులను ప్రభుత్వానికి సరెండర్‌ చేయడం జరుగుతోంది. మాన్సాస్‌ ట్రస్టు భూములు, సింహాచలం ఆలయ భూములు మాయం, రికార్డుల్లో పేజీలు గల్లంతు సంఘటనల్లో అప్పట్లో ఇఒగా పనిచేస్తూ ప్రస్తుతం దేవాదాయశాఖ అడిషనల్‌ కమిషనరు-2గా పనిచేస్తున్న కె.రామచంద్రమోహన్‌తోపాటు అప్పటి అసిస్టెంట్‌ కమిషనరు సుజాతను ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్‌ చేసింది. అంతేకాకుండా బొబ్బిలిలో నాలుగు వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయంటూ ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శనివారం ఆరోపించారు. అలాగే విశాఖపట్నం దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనరు శాంతి, డిప్యూటీ కమిషనరు పుష్పవర్ధన్‌ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, డిటి ముఖంపై ఎసి శాంతి ఇసుక చల్లిన ఘటన దేవాదాయ శాఖలో లోపించిన క్రమశిక్షణకు అద్దంపడుతోంది. దేవాదాయ శాఖలో అత్యంత కీలకమైన కమిషనరు పోస్టుకు రెగ్యులర్‌ అధికారి లేకపోవడంతో కింది స్థాయి అధికారులపై పర్యవేక్షణ కొరవడింది. ఇటీవల కాలం వరకు స్పెషల్‌ కమిషనరు హోదాలో పి.అర్జునరావు కమిషనరు బాధ్యతలు నిర్వహించారు. సాధారణ బదిలీల్లో ఆయనను చేనేత జౌళిశాఖ డైరెక్టరుగా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్త్తుతం ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్‌ కమిషనరు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. రామచంద్రమోహన్‌ ఇప్పటికే సస్పెండ్‌ కాగా, మరో అదనపు కమిషనరు ఆజాద్‌ పలు ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో దుర్గ గుడి ఇఒ సురేష్‌బాబును ప్రభుత్వానికి సరెండర్‌ చేసి, అనతికాలంలోనే రాజమండ్రి రీజనల్‌ జాయింట్‌ కమిషనరుగా నియమించడం చూస్తుంటే ఆ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని పలువురు భావిస్తున్నారు.

Related Posts