YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రమణకు దారేదీ

రమణకు దారేదీ

హైదరాబాద్, ఆగస్టు 11, 
కేసీఆర్ అందరి లాంటి రాజకీయ నేత కాదు. ఆయనకంటూ ఒక పొలిటికల్ విజన్ ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఉపయోగపడతారన్న లెక్కలు వేస్తారు. ఉపయోగపడని వారిని పక్కన పెడతారు. అక్కరకు వచ్చేవారిని అక్కున చేర్చుకుంటారు. కేసీఆర్ ను దగ్గరనుంచి చూసిన వారికెవరికైనా ఇది సులువుగానే అర్థమవుతుంది. ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి బయటకు పంపేయడం కూడా అంతే. ఈటల వల్ల ఉపయోగం కల్లా పార్టీకి భవిష్యత్ లో నష్టమని భావించే కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తలెత్తబోయే పరిణామాలను కూడా ఆయన కొద్దిగా కూడా ఆలోచించలేదు. అదీ కేసీఆర్ నైజం.అయితే ఈటల రాజేందర్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎల్. రమణను తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. నిజానికి ఎల్. రమణ రాష్ట్ర మొత్తం ప్రభావం చేయగలిగిన నాయకుడు కాదని కేసీఆర్ కు తెలుసు. ఎల్. రమణను పార్టీలోకి తీసుకోవడం వల్ల భవిష‌్యత్ లో కొన్ని ప్రయోజనాలను కేసీఆర్ ఆశిస్తున్నారు. ముందుగా ఈటల స్థానంలో మరో బీసీ నేతను తీసుకోవడం వల్ల ఆ వర్గం కొంత శాంతిస్తుంది. కానీ పూర్తిస్థాయిలో కాదు. ఆ వర్గాన్ని ప్రభావం చేసే సమర్థుడైన నేత కూాడా కాదు.ఇక ఎల్. రమణ ను పార్టీలోకి తీసుకువచ్చినందున తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బతీసినట్లవుతుంది. ఇప్పటికే అది తీవ్రంగా దెబ్బతినింది. చంద్రబాబు తెలంగాణ వైపు చూడకుండా ఆయనకు నమ్మకమైన రమణను తీసుకు రావడం ఒక కారణం అయి ఉండవచ్చు. ఇక ముఖ్యమైనది రానున్న ఎన్నికలు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది చెప్పలేం. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తన కుమార్తె భవిష్యత్ కోసం ఎల్ రమణ ను పార్టీలోకి తీసుకున్నారంటున్నారు.ప్రస్తుతం కేసీఆర్ కుమార్తె కవిత శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారు. కవిత పదవీకాలం మరో రెండేళ్లలో ముగుస్తుంది. అంటే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆమె పదవికాలం పూర్తి కానుంది. అయితే మండలికి మరోసారి వెళ్లేందుకు కవిత సుముఖంగా లేరు. వచ్చే ఎన్నికల్లో కవిత జగిత్యాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలిసింది. దీనికి తోడు జగిత్యాలలో పట్టున్న రమణను పార్టీలోకి తీసుకురావడం ద్వారా బలం మరింత పెంచుకోవచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. జగిత్యాలలో కొంత పట్టుండటంతోనే రమణను పార్టీలోకి తీసుకున్నారని చెబుతున్నారు.

Related Posts