హైదరాబాద్, ఆగస్టు 11,
రాష్ట్రంలో కిందటేడు బడి మానేసిన, మొత్తానికే క్లాసులకు అటెండ్ కాని పిల్లల లెక్కను స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తేల్చారు. మొత్తం 33 జిల్లాల్లో 6–14 ఏండ్లలోపు బడికి పోనోళ్లు 9,113 మంది మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. గత విద్యాసంవత్సరం మొత్తం కరోనా కారణంగా ఫిజికల్ క్లాసులే జరగలేదు. చాలా మంది చతువుతున్నారో, మానేశారో తెలియడం లేదు. ఈ క్రమంలో అధికారులు తీసిన లెక్కలు కరెక్టేనా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో 3 నెలల కింద 2020–21 విద్యా సంవత్సరంలో బడి మానేసిన పిల్లల వివరాలను జిల్లాల్లో సేకరించారు. దీని ప్రకారం 6–14 ఏండ్లలోపు వారు 9,113 మంది ఉండగా, 15 –19 ఏండ్లలోపు వారు 4,276 మంది ఉన్నట్టు లెక్క తీశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం14 ఏండ్లలోపు పిల్లలంతా బడికి వెళ్లాల్సిందే. దీంతో ప్రధానంగా 14 ఏండ్లలోపు వారిపైనే విద్యా శాఖ అధికారులు ఫోకస్ చేస్తుంటారు. మొత్తానికే క్లాసులకు హాజరు కాని పిల్లల వివరాలు, డ్రాపౌట్స్ అయిన వారి వివరాలను గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి సేకరించాల్సి ఉండగా, కరోనా కారణంగా అలా జరగలేదు. హెడ్మాస్టర్ల ద్వారా సర్కారు స్కూళ్లలో చదివే వారి వివరాలను తీసుకొని, బడి మానేసిన పిల్లల వివరాలను లెక్క గట్టినట్లు సిబ్బంది చెప్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే వారిని అసలే పట్టించుకోలేదనే వాదనలున్నాయి. మరోపక్క ఇటుక బట్టీలు, వలస కూలీలు, పని ప్రాంతాల్లో ఉండే వారి వివరాలను కూడా సేకరించలేదని తెలుస్తోంది. దీంతో లెక్కలు సరిగా లేవని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో 512 మంది, మేడ్చల్ జిల్లాలో 349 మంది మాత్రమే 14 ఏండ్లలోపు పిల్లలు బడికి వెళ్లడం లేదని లెక్కలు చెబుతున్నాయి. ఎక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 1,214 మంది ఉంటే, తక్కువగా వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో 21 మంది ఉన్నారు. గత విద్యా సంవత్సరం ఫిజికల్ క్లాసులు లేకపోవడంతో, చాలామంది చదువుతున్నారో.. మానేశారో కూడా తెలియట్లేదు. మరోవైపు సర్కారుతో పాటు ప్రైవేటు స్కూళ్లలో చాలామంది ఆన్‌లైన్ పాఠాలు వినలేదని అధికారులే చెబుతున్నారు. పుస్తకాలు తీసుకొని కూడా క్లాసుల మొహం చూడని వారు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా బడికి వచ్చినట్టేనని అధికారులు ఎలా తేలుస్తారని స్టూడెంట్స్ యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి. ఇవన్నీ సర్కారు వేసిన కాకి లెక్కలేనని మండిపడుతున్నాయి. మరోపక్క ఈ వివరాలు సరిగా లేవని, మరోసారి చెక్ చేసిన తర్వాత వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డీఈవోలను ఆదేశించారు. అంటే ఇవన్నీ తప్పుడు లెక్కలని ఆఫీసర్లు గుర్తించినట్టు స్పష్టమవుతోంది. మరోసారి 14 వేల వరకు ఈ లెక్క వచ్చినట్టు ఓ అధికారి చెప్పారు. బడి ఫిజికల్గా ప్రారంభమై, పిల్లలు వస్తేగానీ అసలు లెక్క తేలదని అంటున్నారు.