మైదుకూరు
జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన డి. నేలటూరు గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో నలుగురు ముద్దాయిలను బి.మఠం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మైదుకూరు డిఎస్పి విజయ్ కుమార్ పత్రికా ముఖంగా తెలిపారు. 2012లో జరిగిన చరిష్మా హత్య కు ప్రతీకారంగా, చరిష్మా అత్త, అడపడుచులైన అంజనమ్మ, వరలక్ష్మి లను ఈనెల 6వ తేదీన చరిష్మా రక్త సంబంధీకులు హత్య చేసిన నేపథ్యంలో... చరిష్మా తండ్రి బడబాగ్ని రామాంజనేయ రాజు, చిన్నాన శ్రీనివాస రాజు, వెంకట వరప్రసాద్ రాజు, నారాయణమ్మ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని... వరకట్న వేధింపులతో పెళ్ళైన ఆరు నెలలకే అత్తింటి వారు హత్య చేయడంతో జీర్ణించుకోలేక పోయిన తండ్రి రామాంజనేయ రాజు ఒక పథకం ప్రకారం రప్పించి కూతురి సమాధి వద్దే హత్య చేశారని తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించి, ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న సీఐ కొండా రెడ్డి, ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది ని జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు.