హాకీ ప్లేయర్ రజనీకి రూ. 25లక్షల నగదు ప్రోత్సాహకం
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
ముఖ్యమంత్రి వైయస్.జగన్ ప్రకటన
అమరావతి
ఒలింపిక్స్లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎంను తన తల్లిదండ్రులతో కలిసి రజనీ కలుసుకున్నారు. టోక్యో ఒలిపింక్స్లో కాంస్యపతక పోరువరకూ కూడా భారత మహిళల జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించారు. రజనీని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను బహూకరించారు. గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి, పెండింగ్లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలంపిక్స్ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్తో పాటు టోక్యో ఒలంపిక్స్ 2020లో కూడా పాల్గొన్న క్రీడాకారిణి ఆమె. 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్లలో పాల్గొని ప్రతిభ కనపరిచారు. ఈ కార్యక్రమంలో రజనీ కుటుంబ సభ్యులు, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ, శాప్ వీసీ అండ్ ఎండీ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ అధికారులు రామకృష్ణ, జూన్ గ్యాలట్, రాజశేఖర్, రాజు పాల్గోన్నారు.