హిమాచల్ లో విరిగిపడిన కొండ చరియలు
సిమ్లా, ఆగస్టు 11,
ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందన్న దానికి హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఘోర ప్రమాదం సాక్ష్యంగా నిలుస్తోంది. కిన్నౌర్ జిల్లోని రెఖాంగ్ పీయో – షిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్యాహ్నం 12:45 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఒక లారీ, ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడడంతో వాహనాలన్నీ బండరాళ్ల కింద చిక్కుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సులో ఏకంగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు రెస్క్కూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆపరేషన్ పూర్తికాగానే చెబుతామని అధికారులు వివరించారు. సంఘటన స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయాందోళనలు కలిగిస్తున్నాయి.