YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేంద్రానికి జగన్ శాంపిల్ చూపించేశారా..

కేంద్రానికి జగన్ శాంపిల్ చూపించేశారా..

విజయవాడ, ఆగస్టు 12, 
కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ కారాలు మిరియాలు నూరుతోంది. అయిదారు నెలల క్రితం ఇది ఊహించని పరిణామం. ప్రధాని, హోం మంత్రి అప్పాయింట్ మెంటుల కోసం స్వయంగా ముఖ్యమంత్రి రోజుల తరబడి వేచి చూశారు. వారికి ఏమాత్రం ఇబ్బంది కలిగించని రీతిలో అనేక అంశాలపై రాజీ పడ్డారు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వేజోన్ వంటి అంశాల్లో రాజకీయ పోరాటానికి అవకాశాలున్నప్పటికీ సన్నాయి నొక్కులకే పరిమితమయ్యారు. కానీ తాజాగా కేబినెట్ సమావేశాల సాక్షిగా ముఖ్యమంత్రి బీజేపీపై పోరాటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతకుముందే పార్లమెంటు సభ్యులకు ఢిల్లీలో బీజేపీని ఇరుకున పెట్టాలని సందేశం పంపించేశారు. ఈ మార్పునకు కారణాలేమిటి? అంత హఠాత్తుగా వైసీసీ స్టాండ్ మార్చుకోవడానికి దారి తీసిన పరిస్థితులేమిటనే ప్రశ్న కు అనేక రకాలుగా సమాధానాలు వినవస్తున్నాయి. ఎంపీ రఘురామ రాజు పై చర్యలలో లోక్ సభ స్పీకర్ తాత్సారం చేస్తున్నందుకు సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనేది ఒక వాదన. అయితే అంతటి చిన్న విషయానికి తెగేదాకా లాగాల్సిన అవసరం లేదనేది మరో వాదన. మొత్తమ్మీద బీజేపీ తాజా కదలికలు జగన్ మోహన్ రెడ్డికి ఆందోళన కలిగించాయని తెలుస్తోంది. అందుకు ప్రతిస్పందనగానే బీజేపీకి పరోక్ష హెచ్చరికలు పంపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సీట్లయినా తెచ్చుకోవాలని ఆశిస్తోంది. జనసేనతో కలిసి పోటీ చేస్తే ఒక్క సీటు దక్కుతుందన్న నమ్మకమూ లేదు. ఓట్ల చీలిక మాత్రమే జరుగుతుంది. వైసీపీ అనాయాసంగా విజయం సాధిస్తుందని ఇప్పటికే బీజేపీ పెద్ద నాయకులు ఒక అంచనాకు వచ్చేశారు. రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా దీనితో విభేదించడం లేదు. తిరుపతి వంటి స్థానంలో డిపాజిట్ కోసమే తాపత్రయ పడాల్సి రావడాన్ని అంతర్గతంగా నాయకులు అంగీకరిస్తున్నారు. సొంతగుర్తుపై కొన్నయినా సీట్లు రావాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలవడం తప్పని అనివార్యతను అగ్రనాయకత్వం అంగీకరిస్తోంది. వైసీపీతో కలిసే చాన్సులు లేవు. ఆపార్టీతో ఓటు బ్యాంకులు పరస్పరం బిన్నమైనవి. టీడీపీ కూడా కమలంతో కలిసేందుకు తహతహ లాడుతోంది. ఈ మైత్రిని బలంగా చిగురింప చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం సాంకేతికంగా చేస్తున్న తప్పులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం నడుం బిగిస్తోంది. దీనివల్ల ప్రతిపక్షంగా టీడీపీకి అడ్వాంటేజ్ దక్కుతుంది. తద్వారా వచ్చే ఎన్నికలకు ముందుగానే మార్గం సుగమం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం దృష్ట్యా టీడీపీతో చేతులు కలపకతప్పలేదని ప్రజలకు చెప్పుకోవచ్చు.టీడీపీ నుంచి ఎంపికై బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ సభ్యులు ఈ రెండు పార్టీల మధ్య సంబంధాల పునరుద్ధరణకు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సుజనా చౌదరి తొలి నుంచి తెలుగుదేశం తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్టాడుతున్నారు. వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకే బీజేపీలోకి ఆయన అడుగు పెట్టారు. సుజానా ముందుగానే తొందర పడటంతో బీజేపీ ఆయనను కోవర్టుగా భావించి, పక్కన పెట్టేసింది. ప్రస్తుతం ఆ బాధ్యతలను సీఎం రమేశ్ తీసుకున్నారు. హోం మంత్రి అమిత్ షా తోనూ, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతోనూ ఆయన ఇటీవల సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నివేదించేందుకు భేటీ జరిగినట్లు అధికారికంగా చెబుతున్నారు. అయితే టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా మరోసారి రంగంలోకి దిగేందుకు గల అవకాశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంతవరకూ చంద్రబాబు నాయుడికి ఢిల్లీ పెద్దలు మొహం చాటేశారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు వారికి లేఖలు రాస్తున్నారు. ఫోన్లు చేస్తున్నారు. కానీ పట్టించుకోవడం లేదు. వారి నుంచి పిలుపు వస్తే చాలు, రెక్కలు కట్టుకుని ఢిల్లీలో వాలేందుకు టీడీపీ అధినేత సిద్దంగా ఉన్నారు. అందుకు అవసరమైన ప్రాతిపదికను, ముందస్తు ఏర్పాట్లను చేయడంలోనే ప్రస్తుతం సీఎం రమేశ్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది.టీడీపీ, బీజేపీ చేరువ అవుతున్న వాతావరణాన్ని వైసీపీ పసిగట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీల బలం అవసరం. 2022లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలోనూ తోడ్పాటు అవసరం. అందుకే ఏమాత్రం తోక జాడించినా మా తడాఖా చూపిస్తామనే హెచ్చరికలు పంపాలని వైసీపీ బావిస్తోంది. అందులో భాగంగానే మంత్రులు బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. టీడీపీతో కలిసి రాష్ట్రంలో చక్రం తిప్పాలంటే తాము చూస్తూ ఊరుకోబోమనే సంకేతాలు పంపుతున్నారు. బీజేపీ రాష్ట్రంలో సొంతంగా బలపడటానికి వైసీపీకీ అభ్యంతరం లేదు. అందువల్ల ఓట్ల చీలికతో అధికార పార్టీకే ప్రయోజనం. కానీ టీడీపీతో కలిస్తే బలమైన పోటీ వాతావరణం నెలకొంటుంది. దానిని మాత్రం సహించేందుకు వైసీపీ సిద్దంగా లేదు. కేంద్రం చట్టాల విషయంలోనూ, కీలక అంశాల్లోనూ తమ సహకారాన్ని పొందుతోంది. అదే సమయంలో తమకు వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీనిని నిరోధించకపోతే ప్రత్యర్థి తెలుగుదేశం బలం పెరుగుతుంది. అందుకే బీజేపీ, టీడీపీలు కలిసే అవకాశం లేకుండా చూడాలనేది వైసీపీ తాపత్రయం. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ముందు నుంచి పోరాటం మొదలు పెడితే ఆటోమాటిక్ గానే కేంద్రానికి చెక్ పెట్టినట్లవుతుందనే యోచనతోనే అధికార పార్టీ మాటల యుద్దానికి తెర తీసింది.

Related Posts