హైదరాబాద్, ఆగస్టు 12,
కరోనా నష్టాల నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీ బయటపడుతోంది. అమ్మకాలను వేగంగా పెంచుకుంటోంది. ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే జూలైలో కార్లు, బస్సులు, త్రీవీలర్స్ వంటి ప్యాసింజర్ వెహికల్స్ రిటైల్ అమ్మకాలు 42 శాతం పెరిగాయి. టోకు అమ్మకాలు కూడా బాగున్నాయి. దేశమంతటా వెహికల్స్ షోరూములు ఓపెన్ అయ్యాయి. జనం పబ్లిక్ బస్సుల్లో ప్రయాణించడాన్ని ఇష్టపడటం లేదు. సొంత వెహికల్స్‌ను ఉపయోగించడానికే మొగ్గుచూపుతున్నారు. అందుకే జూన్‌తో పోలిస్తే షోరూముల్లో ప్యాసింజర్ వెహికల్స్ (పీవీలు) జూలై అమ్మకాలు 42.14 శాతం పెరిగి 261,744 యూనిట్లకు చేరాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) వెల్లడించింది. త్రీవీలర్స్ అమ్మకాలు 89 శాతం, కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు 46 శాతం పెరిగాయి కరోనా కేసులు ఎక్కువ కావడంతో మహారాష్ట్ర ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటిసారిగా లాక్‌డౌన్ పెట్టింది. తరువాత ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, తమిళనాడు కూడా రిస్ట్రిక్షన్లు విధించాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు, సప్లయర్లు ప్రొడక్షన్‌ను ఆపేశారు. ప్లాంట్లను మూసేశారు. బజాజ్ వంటి కంపెనీలు కొంతమంది కార్మికులతో ప్లాంట్లను నడిపించాయి. మే నుంచి కరోనా ఎఫెక్ట్ తగ్గుతూ రావడంతో మెజారిటీ కంపెనీలు, షోరూమ్‌లు బిజినెస్‌లను మొదలుపెట్టాయి. మామూలుగా అయితే వెహికల్స్ అమ్మకాలను ప్రస్తుత ఏడాది, గత ఏడాది నెలలతో పోల్చిచూస్తారు. అయితే 2020 మార్చి నుంచి మే వరకు ప్లాంట్లు, షోరూమ్‌లు పూర్తిగా మూతపడ్డాయి. మే నెల మొదటి వారం వరకు ఒక్క వెహికల్‌ను కూడా అమ్మలేదు. కొన్ని కంపెనీలు అయితే జూన్ వరకు తెరుచుకోలేదు. అందుకే గత మే, జూన్ నెలల అమ్మకాలను ఈ ఏడాది మే, జూన్‌లతో పోల్చిచూడటం సాధ్యం కాదని ఫాడా పేర్కొంది. ఇప్పుడు దక్షిణాదిన కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఆటో ఇండస్ట్రీ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని ఫాడా ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ చెప్పారు. ‘‘అన్ని సెగ్మెంట్ల వెహికల్స్ అమ్మకాలు పుంజుకున్నాయి. కార్లకు డిమాండ్ బాగుంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనే ఉద్దేశంతో కస్టమర్లు పబ్లిక్ బస్సులో వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. సొంత వెహికల్స్‌వైపు చూస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ నుంచి రూరల్ ఎకానమీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అందుకే టూవీలర్ అమ్మకాలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి’’ అని ఆయన వివరించారు.రిస్ట్రిక్షన్లు లేకపోవడంతో అన్ని రంగాల మానుఫ్యాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్ కార్యకలాపాలు పుంజుకున్నాయి. దీంతో కమర్షియల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్లు జూలై నెలలో 46 శాతం పెరిగి 52,130 యూనిట్లుగా రికార్డయ్యాయి. రూరల్ మార్కెట్లలో కోవిడ్ కేసుల తగ్గుదలతోపాటు మార్కెట్లు తెరుచుకోవడంతో టూవీలర్ల రిటైల్ అమ్మకాలు 21.7 శాతం పెరిగి 17.3 లక్షల యూనిట్లకు చేరాయి. ఈ అమ్మకాలు రికవరీ సంకేతాలను పంపిస్తున్నాయని ఆటో ఇండస్ట్రీ ఎక్స్‌పర్టులు చెబుతున్నారు. అయితే కార్ల కంపెనీలకు సెమీకండక్టర్ చిప్‌ల కొరత ఇబ్బందిగా మారింది. దీంతో మానుఫ్యాక్చరింగ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇన్‌పుట్ కాస్టులు పెరిగిపోవడంతో చాలా ఆటో కంపెనీలు ధరలను పెంచాయి. దీనివల్ల ఇక ముందు డిమాండ్ కొంత తగ్గే అవకాశాలూ ఉన్నాయి. జూలైకు సంబంధించిన రిటైల్ అమ్మకాల డేటా ఇదే నెల హోల్‌సేల్ లేదా ఫ్యాక్టరీ డిస్పాచ్ డేటాకు అనుగుణంగా ఉంది. కన్జూమర్ సెంటిమెంట్స్ బాగుండటం, కరోనా ఎఫెక్ట్‌లు తొలగిపోయి మాక్రో ఎకానమీ మెరుగుపడటం వల్ల జూలై నెలలో హోల్‌సేల్ అమ్మకాలు కూడా దూసుకెళ్లాయి. చాలా కంపెనీలు సేల్స్‌లో రెండంకెల గ్రోత్‌ను సాధించాయి. హోండా, నిస్సాన్, ఎంసీ మోటార్, స్కోడా సైతం భారీ సేల్స్ సాధించాయి. మారుతి సుజుకి అమ్మకాలు కిందటి ఏడాది జూలైతో పోలిస్తే ఈసారి జూలైలో 50 శాతం పెరిగి 1,62,462 యూనిట్లకు చేరాయి. గత ఏడాది జూలైలో కంపెనీ 1,08,064 యూనిట్లను అమ్మింది. డొమెస్టిక్ మార్కెట్ అమ్మకాలు గత నెలలో 39 శాతం పెరిగి 1,41,238 యూనిట్లకు చేరుకున్నాయి. గత జూలైలో వీటి సంఖ్య 1,01,307 యూనిట్లు. టాటా మోటార్స్ డొమెస్టిక్ మార్కెట్ అమ్మకాలు గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ సంవత్సరంలో జూలైలో 92 శాతం పెరిగి 51,981 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గత జూలైతో పోలిస్తే ఈ జూలై హోల్‌సేల్ అమ్మకాలలో 46 శాతం పెరుగుదల సాధించింది.