హైదరాబాద్ ఆగష్టు 12
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్ దశలో రాకెట్‌లో సమస్య ఎదురైంది. జీఎస్‌ఎల్‌వీ మిషన్ విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపంతో ప్రయోగం విఫలమైందని తెలిపారు. జీఎల్‌ఎల్‌వీ ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. నెల్లూరులోని శ్రీహరికోటలో సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 రాకెట్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసిన రాకెట్ మూడో దశలో విఫలమైనట్లు కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు.ఆ తర్వాత మిషన్ విఫలమైనట్లు పేర్కొన్నారు. క్రయోజెనిక్ దశలో సమస్యతో ప్రయోగం విజయవంతం కాలేదని మిషన్ కంట్రోల్ సెంటర్‌లోని రేంజ్ ఆపరేషన్ డైరెక్టర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. వాస్తవానికి రాకెట్ ప్రయోగం గతేడాది లోనే నిర్వహించాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి, సాంకేతిక సమస్యలతో పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 రాకెట్ ద్వారా జీఐశాట్-1 ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టడం, వాటికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో ఈ మిషన్‌ను చేపట్టింది.
తప్పు ఎక్కడ జరిగింది?
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం ఉదయం జీఎస్ఎల్‌వీ పైకి ఎగిరింది. మొదట్లో అంతా సవ్యంగానే సాగింది. బూస్టర్లు సరిగ్గానే మండాయి. మొదటి, రెండో స్టేజీలు కూడా ప్లాన్ చేసినట్లే జరిగాయి. రాకెట్ పైకి ఎగిరిన 4 నిమిషాల 55 సెకన్ల తర్వాత రెండో స్టేజ్ ముగిసే సమయంలో క్రయోజనిక్ ఇంజిన్‌ను ప్రారంభించారు. అయితే ఇక్కడే రాకెట్ అదుపు తప్పింది. క్రమంగా తన వేగాన్ని కోల్పోతూ కిందికి రావడం ప్రారంభమైంది. కొన్ని నిమిషాల తర్వాత ఈ ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో ప్రకటించింది. క్రయోజనిక్ స్టేజ్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రయోగం పూర్తి కాలేదని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు.
స్పేస్ లాంచ్ వెహికిల్స్‌లో క్రయోజనిక్ అనేది చివరి దశ. అతి తక్కువ ఉష్ణోగ్రతల దగ్గర కూడా పని చేస్తూ.. ఇవి అధిక బరువు ఉన్న శాటిలైట్లను కక్ష్యలో ఉంచుతుంది. ఈ క్రయోజనిక్ ఇంజిన్.. ద్రవరూప్ ఆక్సిజన్, ద్రవరూప హైడ్రోజన్‌లను ప్రొపెల్లెంట్లుగా ఉపయోగించుకుంటుంది. ఈ రెండూ వేర్వేరు ట్యాంక్‌లలో నిల్వ చేసి ఉంటాయి. అక్కడి నుంచి బూస్టర్ పంపులు వాటిని టర్బో పంప్‌లోకి పంపిస్తాయి. ఈ స్టేజ్‌లోనే ఈ ప్రయోగం విఫలమైంది. అయితే సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని ఇస్రో చైర్మన్ చెప్పినా.. కచ్చితంగా ఆ సమస్య ఏంటని మాత్రం ఆయన వెల్లడించలేదు. చాలా ఆలస్యం.. ఇప్పుడు ఫెయిల్ నిజానికి ఈ ప్రయోగం గతేడాది మార్చి 5నే చేయాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల అప్పుడు చేయలేదు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది మార్చి 28న లాంచ్ చేయాలని భావించినా.. చిన్న సాంకేతిక సమస్య కారణంగా ఏప్రిల్‌కు, ఆ తర్వాత మే నెలకు వాయిదా వేశారు. దీంతో Gisat-1 లాంచ్ దాదాపు ఏడాదిన్నర ఆలస్యంగా జరిగింది. ఇప్పుడు మొత్తంగా ప్రయోగమే విఫలమైంది.ఈ Gisat-1 శాటిలైట్ అంతరిక్షం నుంచి ఓ నిఘా నేత్రంగా పని చేస్తుంది. ఇందులోని హైరెజల్యూషన్ కెమెరాలు.. ఎప్పటికప్పుడు ఇండియా భూభాగం, సముద్ర తీరాలపై ఓ కన్నేసి ఉంచుతాయి. ముఖ్యంగా రక్షణ రంగానికి సరిహద్దులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడానికి ఈ Gisat-1 బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేయడానికి కూడా ఈ శాటిలైట్ పనికొస్తుందని భావించారు.