షర్మిలకు సగం ఆస్తి ఇవ్వాలి : రఘురామ
న్యూఢిల్లీ, ఆగస్టు 12,
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో తరుచూ విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచే నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసి, తనపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు, ఏపీలో ఎన్నికల ముందు షర్మిల పాదయాత్ర మాట్లాడటం గమనార్హం. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాత్ర కూడా ఉందని అన్నారు.పార్టీ తరఫున ఆమె ముమ్మర ప్రచారం చేశారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇప్పుడు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. అయితే జగన్‌కు ఉన్న ఆస్తుల్లో సగం షర్మిలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయంలో సగ భాగం పాత్ర వహించిన షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వాలని రఘురామ సూచించారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్ 10ని తాను ఉల్లంఘించడం లేదని ఈ సందర్భంగా అన్నారు.ఫిరాయింపుల అంశంపై విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును కలిసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నూలుకు హైకోర్టు మార్చాలని కేంద్ర మంత్రిని తమ ఎంపీలు కోరారని.. పార్టీ హెడ్ క్వార్టర్స్ మార్చినంత త్వరగా కోర్టును మారుస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తిరుమల వెంకన్ననూ వదలడం లేదని.. టీటీడీ నుంచి రూ.50 కోట్లు తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారని ఆక్షేపించారు.రెబల్ ఎంపీ రఘురామ వ్యవహారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు దృష్టికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు తీసుకెళ్లారు. ఎంపీ రఘురామపై వేటుకు మార్గం సుగమం చేసేందుకు ఏకంగా రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే సభ్యులపై అనర్హత వేటు వేయడానికి కచ్చితమైన గడువు విధించేలా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌కు సవరణ చేయాలని వైసీపీ ఎంపీలు కోరారు.