YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 శ్రీ శైలంలో  అమిత్ షా

 శ్రీ శైలంలో  అమిత్ షా

 శ్రీ శైలంలో  అమిత్ షా
కర్నూలు, ఆగస్టు 12,
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లన్నను గురువారం దర్శించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో.. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దర్శించున్న అనంతరం అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్న దర్శనానికి వచ్చిన హోం మంత్రి అమిత్‌షాకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ వాణి మోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆలయ అర్చకస్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అమిత్ షా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మల్లికార్జున స్వామి అమ్మవార్ల చిత్ర పటాన్ని కేంద్ర మంత్రికి బహూకరించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం.. గురువారం ఉదయం హైదరాబాద్‌‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంట చేరుకున్నారు. సున్నిపెంట న నుంచి కేంద్ర హోం మంత్రి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం దేవస్థానం అతిథి గృహంలో మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుని.. మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ తర్వాత శక్తివంతమైన నేతగా పేరున్న అమిత్ షా.. శ్రీశైలం పర్యటన సమాచారం ఒక్క రోజు ముందు మాత్రమే బయటకు వచ్చింది.ఆయన పర్యటన సర్‌ప్రైజ్‌గా సాగినప్పటికీ.. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనగా భావించొచ్చు. శ్రీశైలం ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉండేది. అందుకే అమిత్ షా పర్యటన వివరాలను ముందుగా బహిర్గతం చేయలేదని భావిస్తున్నారు. లోక్ సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన మరుసటిరోజే అమిత్ షా శ్రీశైలం రావడం గమనార్హం.
రాయలసీమను దత్తత తీసుకోండి
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసిన రాయలసీమ ప్రాంత బీజేపీ నేతలు…ప్రత్యేక వినతిని ఆయన ముందుంచారు. రాయలసీమలో కరువుకాటకాలు, వెనుకబాటుతనాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కరువు కాటకాలతో నిండిపోయిన రాయలసీమను దత్తత తీసుకోవాలని అమిత్ షాను కోరారు. అమిత్ షా రాయలసీమను దత్తత తీసుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో పరుగులుపెడుతుందని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. తమ వినతిపై అమిత్ షా సానుకూలంగా స్పందిస్తారని కర్నూలు జిల్లా బీజేపీ నేత అంబాల ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.మరి రాయలసీమ ప్రాంత బీజేపీ నేతల అభ్యర్థనపై అమిత్ షా ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. మొత్తానికి ఈ అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాయలసీమను అమిత్ షా దత్తత తీసుకుంటే ఆ ప్రాంతంలో బీజేపీ రాజకీయంగా బలపడే అవకాశముంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Related Posts