మహా భారత యితిహాసాన్ని, అష్టాదశ పురాణాలు, భాగవతము వ్రాసి వేదవిభజన చేసిన వ్యాసుడు నాలుగు లక్షలకు పైగా శ్లోకాలు రచించాడు. ఆయన గ్రంథాలలో పాత్రల సంఖ్య వేలల్లో ఉంటుంది. అందువలన ‘చ' అక్షరం అనేక మార్లు వినియోగించారు.
తరతరాల రాజుల పేర్లు, ఋషుల పీర్లు వ్రాసేటప్పుడు 'భవాన్ భీష్మశ్చ,కర్ణశ్చ,కృపశ్చ, సమితింజయ' అని 'చ'కారం వాడేవారు. అది తెలిసిన మహాకవి కాళిదాసు వేదవ్యాసుడిని 'చ'కార కుక్షి అని సంబోధించేవాడు. ఆయన మీద గౌరవం అమితంగా ఉన్నప్పటికీ అలా పిలవడం కాళిదాసు బలహీనత. ఒకరోజు కాళిదాసు కాశి పర్యటిస్తుండగా ఆ క్షేత్రంలో వ్యాస భగవానుడి విగ్రహం కనబడింది. భక్తితో విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేశాడు కాళిదాసు. విగ్రహం చూడగానే అతడికి చకారకుక్షి అనే పేరు గుర్తొచ్చింది. అలా స్ఫురించగానే చిలిపిగా విగ్రహం బొడ్డులో కుడి చూపుడు వేలును వుంచాడు కాళిదాసు. ఎందుకలా చేస్తున్నావని అడిగారు అతనితో వచ్చినవారు. “తాతగారి పొట్టనిండా 'చ'కారాలే ఉంటాయి కదా. ఎన్ని వున్నాయో చూస్తున్నాను. అవసరమైతే కొన్ని తీసుకుని నా కావ్యాలలో వాడుకుంటాను” అన్నాడు నవ్వుతూ కాళిదాసు. కాసేపటికి కాళిదాసు వేలుని తియ్యబోతే బయటకు రాలేదు. విగ్రహంలో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా ఊడి రాలేదు. కాళిదాసు బాధగా ముఖం పెట్టి “తాతా .. ఇదేమి పరీక్ష” అనుకున్నాడు మనసులో. మరుక్షణం విగ్రహం నుండి మాటలు వినిపించాయి. “ 'చ'కార కుక్షి అని ఎగతాళి చేసినందుకు ఇదే శిక్ష” అంది విగ్రహం. “తప్పయింది. క్షమించి వదిలేయండి. మీరంటే నాకెంతో భక్తి గౌరవాలున్నాయి” అని బ్రతిమాలాడు కాళిదాసు. “నీకు మహాకవినన్నఅహంకారం. లక్షల శ్లోకాలతో వేల పాత్రలతో వందల కొద్దీ చరిత్రలు సృష్టించిన నన్నే ఎగతాళి చేసేంత గొప్పవాడివా? అనేక పాత్రల గురించి వర్ణించేటప్పుడు 'చ'కారం వాడక తప్పదు. అందుకు నన్ను ఎగతాళి చెయ్యటం భావ్యమేనా” అన్నాడు వ్యాసుడు. కాళిదాసు నొచ్చుకుంటూ “నాది మన్నించలేని అపరాధమని అంగీకరిస్తున్నాను. మహామహుల చరిత్రలు, మహాకావ్యాలు వ్రాసేటప్పుడు అలా జరుగుతుంది. మహాతేజస్వి అయిన మీ ముందు అల్పుడునైన నేనెంత? క్షమించి వదిలేయండి” అని బ్రతిమలాడాడు. “శిక్ష తప్పించుకోవాలంటే ఒక మార్గం ఉంది. వినిపించుకుంటే బయటపడతావు” అన్నాడు వ్యాసుడు. “చిత్తం. సెలవివ్వండి” అన్నాడు కాళిదాసు. “సరే. నేనొక ఘట్టం చెబుతాను. 'చ'కారాలు లేకుండా శ్లోకం చెప్పు. చెప్పగలిగితే బంధవిముక్తుడ వవుతావు” అన్నాడు వ్యాసుడు. “నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తా” అన్నాడు కాళిదాసు. వ్యాసుడు “పాండవులు ద్రౌపది భర్తలు. అయిదుగురూ అన్నదమ్ములే. వాళ్ళలో పెద్దవాడైన ధర్మరాజుకి భార్యగా ఉన్నప్పుడు తమ్ముళ్ళు నలుగురూ ఆమెకు మరిది వరుస అవుతారు. వారిలో కనిష్టుడైన సహదేవుడికి భార్యగా ఉన్నప్పుడు అన్నలు నలుగురూ ద్రౌపదికి బావ వరుస అవుతారు. ధర్మరాజు ఆమెకు మరిది కాడు, సహదేవుడు బావ కాడు. వరుసగా పేర్లు, వరుసలో చెప్పుకుంటూ వ్రాయాలంటే 'చ'కారం లేకుండా సాధ్యమవుతుందా? 'చ'కారం లేకుండా శ్లోకం చెబితే విడిచి పెడతాను” అన్నాడు వ్యాసుడు. వినమ్రంగా శిరస్సు వంచాడు కాళిదాసు. “నా ప్రయత్నం చేస్తాను. పరీక్ష పెట్టినప్పుడు ప్రయత్నించకపోవడం అవిధేయత అవుతుంది. కనుక నా శ్లోకం చిత్తగించండి.
ద్రౌపద్యా: పాండు తనయాః పతి దేవర భావుకాః
న దేవరో ధర్మరాజః సహదేవో న భావుకః”
‘ద్రౌపదికి పాండుపుత్రులు భర్తలు, మరిదీ, బావ వరుస కూడా. కానీ ధర్మరాజు మరిది వరుస కాడు. సహదేవుడు బావ వరుస కాడు’ అని భావం.
“ఈ శ్లోకంలో మీరు కోరిన భావంతో మిమ్మల్ని మెప్పిస్తే నన్ను బంధవిముక్తుడిని చేయ ప్రార్ధన” అన్నాడు కాళిదాసు. శ్లోకంలో 'చ'కారం రాలేదు. కనుక వ్యాసుడు “మెచ్చాను నీ ప్రతిభ. చిరకాలం నిలిచిపోయే మహా కావ్యాలు వ్రాయాలని ఆశీర్వదిస్తున్నాను” అని దీవించాడు. మరుక్షణం కాళిదాసు వేలు బయటకు వచ్చింది. విగ్రహానికి చేతులు జోడించి నమస్కరిస్తూ “నా అపచారం మన్నించండి. మీ వంటి మహానుభావులను ఎవరు కించ పరచినా శిక్ష అనుభవించాలని బోధపడింది” అన్నాడు కాళిదాసు. కాళిదాసు ప్రతిభను లోకానికి తెలిపేందుకే ఇలాంటి పరీక్షకు వ్యాసుడు గురి చేసాడని అనుకుంటారు. గొప్పవాళ్ళను యెగతాళి చేయరాదని, తెలిసో , తెలియకో చేసినట్లయితే తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుందని గ్రహించి మసలుకోవాలి.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో