విజయవాడ, ఆగస్టు 13,
ఏపీలో ఉప ముఖ్యమంత్రులకు ముందుందు ముప్పు అంటున్నారు. రెండేళ్ళ క్రితం జగన్ బంపర్ మెజారిటీతో గెలిచాక ఏకంగా అయిదుగురు నేతలను ఉప ముఖ్యమంత్రులను చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు అన్నీ బేరీజు వేసుకుని జగన్ చేసిన ఈ ప్రయోగం చూసి తలపండిన నేతలు కూడా నోళ్ళు వెళ్ళబెట్టారు. మరి రెండేళ్ల కాలంలో ఉప ముఖ్యమంత్రులు తమ సత్తా చాటుకున్నారా అంటే లేదు అనే జవాబు వస్తుంది. పోనీ వారు పేర్లు, శాఖలు అయినా ఏపీ జనాలకు తెలుసా అంటే అది కూడా పెద్ద డౌటే. అంటే జనాలకు అయిదురుగు ఉప ముఖ్యమంత్రులు ఎవరో గుర్తుకు రానపుడు జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ నీరు కాక మరేమవుతుంది.ఒకపుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కటి అంటేనే ఎంతో విలువ ఉండేది. కాంగ్రెస్ జమానాలో కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రి అంటే ఏకంగా సీఎం అయినంతగా సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ కి దాని వల్ల రాజకీయ లాభం ఏ మేరకు వచ్చింది అన్నది పక్కన పెడితే ఫలానా వర్గానికి అలా కాంగ్రెస్ న్యాయం చేసింది అన్న మాట అయితే ఇప్పటికీ ఉంది. మరి జగన్ చేసిన ప్రయోగం వల్ల వ్రతం చెడింది, ఫలం దక్కలేదు అంటున్నారు. దాంతో వీరి పనితీరు స్వయంగా బేరీజు వేసుకున్న జగన్ చెక్ పెట్టాల్సిందే అన్న డెసిషన్ కి వచ్చెశారుట.ఏపీలో చూసుకుంటే ఉత్తరాంధ్రాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ధర్మాన కృష్ణ దాస్, పుష్ప శ్రీవాణిలకు ఈ పదవులు దక్కాయి. పశ్చిన గోదావరి నుంచి ఆళ్ళ నాని ఉంటే గుంటూరు నుంచి మేకతోటి సుచరిత ఉన్నారు. ఇక మైనారిటీ కోటాలో కడప నుంచి అంజాద్ భాషా ఉన్నారు. వీరి స్థానంలో కొత్త వారు అంటే అదే సామాజిక వర్గాలు, ప్రాంతాలు కూడా కలసి రావాలి. ఇది కష్టమేనీ కాదు, వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమెల్సీలు కూడా ఇరవై మంది దాకా ఉన్నారు. దాంతో కొత్త వారిని తెచ్చి ఈ సీట్లు భర్తీకి జగన్ రెడీ అవుతున్నారుట.అయితే ఉప ముఖ్యమంత్రులు అని పేరుకు అంటున్నా అవి అలంకారప్రాయమైన పదవులే అన్న విశ్లేషణలు నాడే వినిపించాయి. ఒకరికి ఈ పోస్ట్ ఇస్తే కచ్చితంగా ముఖ్యమంత్రి తరువాత రెండవ స్థానంలో ఉన్నారు అనేవారు. కానీ ఇంత మందికి ఇవ్వడం వల్ల ఎవరికీ రాజకీయంగా గుర్తింపు ఉండదనే అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రుల శాఖల విషయంలో కూడా సరైన పనితీరు కనబరచలేదన్నది వైసీపీ హై కమాండ్ వాదన. దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అన్ని శాఖలనూ జగనే సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటూంటే తమకు వెయిట్ ఏముంది అన్న బాధ వారిది. ఏది ఏమైనా కనీసం ఏపీలో తిరుగుతూ హడావుడి కూడా చేయకపోతే ఎందుకు ఈ పదవులు అన్న మాట ఉంది. అలా నోటి ధాటితో కానీ జనంతో కనెక్షన్ పెట్టుకోవడంలో కానీ చూస్తే ఈ డిప్యూటీలు పూర్ గా ఉన్నారనే వేటు వేయనున్నారుట.