కడప, ఆగస్టు 13,
ఆంధ్రప్రదేశ్ లో జగన్ వ్యూహం సత్ఫలితాలనిస్తుందనే చెప్పాలి. రెండేళ్ల పాలనలో వరసగా జరుగుతున్న ఎన్నికలు వన్ సైడ్ ఫలితాలను తెచ్చిపెడుతుండటం జగన్ పనితీరుకు అద్దం పడుతుంది. ప్రధానంగా సంక్షేమ పథకాలు జగన్ అమలు చేస్తున్న తీరు పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారన్నది ఈ ఫలితాలను బట్టి స్పష్టమవుతుంది. ఎన్ని కష్టాలొచ్చినా జగన్ పథకాలను ఆపకపోవడమే ప్రజల్లో విశ్వాసం పెరిగిందనడానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవాల్సిందే.కరోనా కష్టకాలంలోనూ జగన్ పథకాలను నిలుపుదల చేయలేదు. ఈరెండేళ్ల కాలంలో దాదాపు లక్ష కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమ చేశారు. వివిధ పథకాల కింద ప్రతి నెలా ఏదో ఒక పథకం కింద నిధులను జమ చేస్తూ వస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతితో పాటు రైతులు కూడా జగన్ పట్ల సానుకూల ధోరణని కనపరుస్తున్నాయి. ఈ రెండేళ్లలో అనేక ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లోనూ అదే తీరును జగన్ పార్టీ కనపర్చింది. ఇక త్వరలో జరగబోయే బద్వేలు ఉప ఎన్నికలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పక తప్పదు. ప్రజల సొమ్మును జగన్ పప్పు బెల్లాలుగా పంచిపెడుతున్నారన్న విపక్షాల విమర్శలను కూడా ప్రజలు పట్టించుకోవడం లేదని ఈ ఫలితాల ద్వారా వెల్లడవుతుంది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో సయితం జగన్ పార్టీ ఏకపక్షంగా విజయం నమోదు చేయడంతో విపక్షాలు కూడా పునరాలోచనలో పడ్డాయి.ప్రతి నెలా ఒకటోతేదీ నాడే ఎన్ని అవరోధాలున్నా పింఛను ను ఇంటికే పంపిణీ చేయడం కూడా జగన్ కు అడ్వాంటేజీగా మారింది. అభివృద్ధి పెద్దగా లేకపోయినా ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో పాటు కొన్నింటిపై న్యాయస్థానాలను ఆశ్రయించి జగన్ ప్రభుత్వానికి అడ్డంకులు కల్పించడం కూడా వైసీపీకే ప్లస్ గా మారింది. మొత్తం మీద జగన్ ఇదే రీతిన పాలనను కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా సేమ్ ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్ఠీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వంటివి అప్రధాన అంశాలుగా ప్రజలు చూస్తున్నారని చెప్పక తప్పదు.