భువనేశ్వర్, ఆగస్టు 13,
కోవిడ్ -19 మహమ్మారి విజృంభణ కారణంగా దర్శనాలు నిలిపివేసిన ఒడిశాలోని పూరీలోని సుప్రసిద్ధ జగన్నాథుని ఆలయం తెరుచుకుంది. అయితే, దేవాలయంలోకి పూర్తి స్థాయిలో భక్తులను ఈ నెల 23 నుంచి అనుమతిస్తారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మూడు నెలలపాటు మూసివేసిన తర్వాత గురువారం ఈ దేవాలయాన్ని తిరిగి తెరిచారు. తొలి దశలో ఈ దేవాలయం సేవకుల కుటుంబ సభ్యులకు మాత్రమే జగన్నాథుని దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.భక్తుల దర్శనాలకు సంబంధించి ఆలయ అధికారులు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. జగన్నాథుడి దర్శన సమయాల్లో మార్పులు చేశారు. అన్ని రోజులూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఉంటాయి. అన్ని వారాంతాలతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి అయిన ఆగస్టు 30న, అలాగే గణేష్ చతుర్థి అయితే సెప్టెంబర్ 10 వంటి ప్రధాన పండుగలలో ఈ ఆలయం మూసివేయనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో శని, ఆదివారాల్లో ప్రభుత్వ ఆంక్షలు అమలవుతాయి కాబట్టి ఆ రోజుల్లో జగన్నాథుని దేవాలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు.కాగా, 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుని దేవాలయాన్ని కోవిడ్ మహమ్మారి రెండో ప్రభంజనం నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి మూసేశారు. ఈ దేవాలయంలోని సేవకుల కుటుంబ సభ్యులకు తొలి దశలో గురువారం నుంచి జగన్నాథుని దర్శనం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. వీరు తమకు దేవాలయం జారీ చేసిన గుర్తింపు కార్డును, అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులను సమర్పించి ఉంటుంది. రెండో దశలో ఆగస్టు 16 నుంచి పూరీలో నివసించేవారిని అనుమతిస్తామని తెలిపారు. ఆగస్టు 23 నుంచి సాధారణ ప్రజానీకంలోని భక్తులంతా దర్శనం చేసుకోవచ్చునని తెలిపారు. వీరు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను కానీ, కోవిడ్-19 నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టును కానీ సమర్పించాలన్నారు. దర్శనానికి ముందు 96 గంటల వ్యవధిలో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవలసి ఉంటుందన్నారు. ఆధార్ వంటి గుర్తింపు కార్డును కూడా తమ వెంట తీసుకుని రావాలని తెలిపారు.అలాగే, దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆలయ అధికారులు తెలిపారు. మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రపరచడం, సామాజిక దూరం పాటించేలా కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు విగ్రహాలను తాకడానికి అనుమతించమని, ఆలయం లోపల పూలు,భోగ,దీప నిషేధం అమలులో ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.