మాతృ భాషను మరవద్దు...
- భాషా చైతన్య సదస్సు లో ఎమ్మెల్యే భూమన పిలుపు
తిరుపతి
ఆంధ్రులు మన మాతృ భాష తెలుగు పట్ల మక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు.మన మాతృభాషను కాపాడుకోవాలని కోరారు. తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో...
తిరుపతి శ్రీ పద్మావతి మహిళ యూనివర్శిటీ సెమినార్ హాల్ లో శుక్రవారం నిర్వహించిన భాషా చైతన్య సదస్సులో భూమన పాల్గొని ప్రసంగించారు.ఆంగ్ల భాష అత్యంత అవసరమే కావచ్చని, అయితే ఆంగ్లాన్ని నేర్చుకుంటూనే తెలుగు భాషను వదలకూడదని భూమన పునరుద్ఘాటించారు.
ఈ విషయంలో పొరుగు రాష్ట్రం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, అక్కడ వారు తమ మాతృ భాష తమిళంను ప్రేమిస్తారని తెలిపారు. 400 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ కే పరిమితమైన ఆంగ్ల భాష....దాని సామ్రాజ్య వాదలక్షణం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 250 దేశాలను చుట్టు ముట్టిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న చినీ భాష విశ్వ భాష కాకపోవడానికి కారణం దానికున్న పరిమిత ప్రదేశ జ్ఞానమే అని అభిప్రాయపడ్డారు. దేశంలో హిందీ తర్వాతి స్థానంలో 13 కోట్ల మంది తెలుగు భాష తెలిసిన వారు ఉన్నప్పటికీ ..అందులో తెలుగు భాషను వాడే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోవడం బాధాకరమన్నారు. సుమారు ఏడు వేలకు పైగా పదాలు ఉన్నప్పటికీ కేవలం నూరు నూటయాభై పరిమిత తెలుగు పదాలతోనే భావవ్యక్తీకరణ చేసే పరిస్థితికి రావడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఎంతో సౌందర్యం కలిగిన తెలుగు భాష నీరు
గారే పరిస్థితి తలెత్తుతోందంటే...
అందుకు కారణం
చాలా మందిలో దాన్ని నేర్చుకోవాలన్న ఆర్తి లేకపోవడమే అన్నారు. ఇలాంటి కారణాల వల్లే తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడం అంత సులభం కాలేదని...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శత విధాల సల్పిన కృషి ఫలితంగా ప్రాచీన హోదా దక్కిందన్నారు. మానవ అనాగరిక సంస్కృతి నుంచి నాగరిక సంస్కృతి ఏర్పడిన కాలం వరకు అనేక వేల భాషలు పుట్టుకొచ్చాయని, ఈ వేలాది భాషలను మానవ అవసరాల కోసం వాడుకలోకి తీసుకు రావడం జరిగిందన్నారు. ఇతరులతో భావవ్యక్తీకరణ కోసం, అవసరాల కోసం భాష పుట్టడం జరుగుతుందని తెలిపారు.
ఏ భాషను తక్కువగా మాట్లాడుతారో ఆ భాష అంత తొందరగా చనిపోవడానికి సిద్ధంగా ఉంటుందన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని గిరిజనులు మాట్లాడే భాష ఎంత కాలం మనుగడ సాగిస్తున్న అనేది అనుమానమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా ప్రపంచంలో అనేక భాషలు చనిపోవడం జరిగిందని భూమన పేర్కొన్నారు. తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి ని భూమన కరుణాకర రెడ్డి సత్కరించారు. భూమన కరుణాకర రెడ్డికి లక్ష్మీ పార్వతి దుశ్శాలువ కప్పి, పుష్ప గుచ్ఛం సమర్పించి సత్కరించారు.