స్వాతంత్య్ర సమరయోధులకు చెందిన వితంతు కూతుళ్లకు కూడా డిపెండెంట్ పెన్షన్
ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ ఆగష్టు 13
స్వాతంత్య్ర సమరయోధులకు చెందిన వితంతు కూతుళ్లకు కూడా డిపెండెంట్ పెన్షన్ ఇవ్వాలని ఇవాళ ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకవేళ ఆ కేసులో మిగితా అన్ని షరతులు వర్తిస్తే, అప్పుడు 8 వారాల్లోగా ఆ వితంతువుకు పెన్షన్ ఇవ్వాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. స్వాతంత్య్ర సమరయోధులకు చెందిన కూతుళ్లు విడాకులు తీసుకున్నా.. లేక వాళ్ల భర్తలు చనిపోయినా.. అలాంటి వారికి ఫ్రీడం ఫైటర్ పెన్షన్ ఇచ్చేది లేదని గతంలో కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొన్నది. స్వతంత్రతా సైనిక్ సమ్మాన్ పెన్షన్ స్కీమ్‌కు అలాంటి వాళ్లు అర్హులు కాదని కేంద్రం ఓ లేఖలో తెలిపింది.చనిపోయిన ఓ స్వాతంత్య్ర సమరయోధుడి కూతురు ఇటీవల ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సైనిక్ సమ్మాన్ పెన్షన్‌ను తనకు ఇప్పించాలని కోరింది. అయితే ఆ మహిళ తన భర్తను కోల్పోయింది. అంతే కాదు, ఆమె మానసికంగా, శారీరకంగా దివ్యాంగురాలు. ఆ పిటిషన్‌ను ఇవాళ జస్టిస్ వీ కామేశ్వర రావు విచారించారు. సైనిక్ పెన్షన్‌ను ఫ్రీడం ఫైటర్ల వితంతు కూతుళ్లకు ఇవ్వరని గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ కామేశ్వర రావు తోసిపుచ్చారు. పెన్షన్ స్కీమ్ లబ్ధి విడాకులు తీసుకున్న కూతుళ్లకు కూడా ఇవ్వవచ్చు అని గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఢిల్లీ హైకోర్టు స్వాగతించింది.వితంతు మహిళ తన తండ్రి నవంబర్ 1, 2019లో చనిపోయినట్లు తన పిటిషన్‌లో తెలిపింది. అయితే ఆమె పూర్తిగా తన తండ్రిపై ఆధారపడేది. అందుకే ఫ్రీడం ఫైటర్ పెన్షన్‌ను తనకు బదిలీ చేయాలని ఆమె కోరింది.