కాకినాడ, ఆగస్టు 14,
చలమలశెట్టి సునీల్.. పారిశ్రామికవేత్త అయిన ఈయన రాజకీయ కల నెరవేరలేదు. ఎన్ని పార్టీలు మారినా ఫలితం మాత్రం దక్కలేదు. మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. చలమలశెట్టి సునీల్ ఇప్పటికీ తెలుగుదేశం, వైసీపీలు మారి మారి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కాలేకపోయారు.చలమలశెట్టి సునీల్ ఆర్థికంగానే కాదు సామాజికపరంగా కూడా బలమైన నేత. కాపు సామాజికవర్గానికి చెందిన చలమలశెట్టి సునీల్ కాకినాడ నుంచి ఎంపీగా గెలవాలన్న కోరిక. ప్రతి ఎన్నికలో ఆయన కోట్లు ఖర్చు పెడుతూ వస్తున్నారు. కానీ గెలుపు మాత్రం లభించడం లేదు. 2014లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓటమి పాలయ్యారు. చివరకు 2019 ఎన్నికల నాటికి టీడీపీలోకి మారి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో పరాజయం పాలయ్యారు.తర్వాత చలమలశెట్టి సునీల్ వైసీపీలో చేరారు. వైసీపీలో చేరినా ఆయన ప్రస్తుతం యాక్టివ్ గా లేరు. ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు కాకినాడలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ చలమలశెట్టి సునీల్ కు రాజ్యసభ పదవి దక్కే అవకాశం లేదంటున్నారు. రాజ్యసభ కోసం ఇప్పటికే జాబితా రెడీ అయిపోయందని, అందులో ఈయనకు అవకాశం లేదన్నది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.దీంతో చలమలశెట్టి సునీల్ మరోసారి 2024 ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ప్రస్తుత ఎంపీగా ఉన్న వంగా గీతను పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారని టాక్. దీంతో మరోసారి చలమలశెట్టి సునీల్ వైసీీపీ నుంచి పోటీ చేయడం గ్యారంటీఅని అంటున్నారు. ఈసారైనా ఆయన గెలిచి కలనెరవేర్చుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.