హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి లేఖ రాసారు. మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, భీమారం గ్రామంలోని దళిత, గిరిజన భూములపై ప్రభుత్వ అధికారుల దాడులు నిలుపుదల చేయాలి. ఖమ్మం జైల్లో మహిళలను చిత్రహింసలు పెట్టిన ఘటనపై విచారణ జరిపించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పోడు సాగుదారుల భూములపై దాడులను నిలుపుదల చేయలని అన్నారు.
మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, భీమారం గ్రామంలోని సర్వే నెంబర్ 138లో 15 మంది దళితుల, గిరిజన కుటుంబాలకు ఒక ఎకరం చొప్పున 1986లో పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. ఎన్నో ఏండ్లుగా వారి కబ్జాలో ఉన్న భూములలో అధికారులు చెట్లు నాటడానికి ప్రయత్నించడం అన్యాయం. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ పోడు రైతులకు పట్టాదారుపాసు పుస్తకాలు కొత్తగా ఇవ్వబడినాయి. రైతులు బ్యాంకుల నుండి క్రాప్లోన్ కూడా తీసుకుంటున్నారు. ఈ ఆధారాలను పట్టించుకోకుండా అటవీ అధికారులు చెట్లు నాటడానికి రావడం దుర్మార్గం. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్లోని చంటిపిల్లలలున్న మహిళలను అరెస్టు చేసి జైళ్లో పెట్టడం కక్షసాధింపు చర్యే. వీరిని జైళ్లో కొట్టడము, బాతురూంలు కడిగించడం దారుణం. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించాలి. చెట్లు పెంచడానికి కేంద్రం నుండి కంపా నిధులు రావడంతో అటవీ శాఖ అధికారుల అవినీతి పెరిగిపోతున్నది. చెట్లునాటే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరిగిపోయాయని చాడ వెంకట్ రెడ్డి లేఖలో పేర్కోన్నారు.