ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి దాసరి నారాయణరావు లాంటి సినీ కుటుంబ పెద్దలు కావాలని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మే 4న దర్శకరత్న దాసరి జయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ అధ్యక్షుడి పేరిట పవన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. దాసరి నారాయణరావు పుట్టినరోజును ‘డైరెక్టర్స్ డే’గా ఖరారు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ట పవన్ సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడి పేరుకి ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి, దర్శకుడి స్థాయిని సగర్వంగా పెంచిన వ్యక్తి దాసరి నారాయణరావు. ఆయన జయంతి మే 4ను అందరూ చిరకాలం గుర్తుపెట్టుకునేలా ఈరోజు డైరెక్టర్స్ డేగా నిర్ణయించిన తెలుగు సినీ దర్శకుల సంఘానికి, దీని కోసం చొరవ తీసుకున్న సంఘం అధ్యక్షుడు శంకర్‌కు నా అభినందనలు. దాసరి నారాయణరావు మొదటి సినిమా ‘తాతా మనవడు’ నుంచి అన్ని సినిమాల్లో కుటుంబ విలువలు, సామాజిక స్పృహ కనిపించేవి. వారితో నాకు మంచి అనుబంధం ఉండేది’ అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.రంగస్థలం నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన దాసరి.. ఓ నటుడిగా, నిర్మాతగా, రచయితగా బహుముఖ సేవల్ని ఈ రంగానికి అందించారని పవన్ కొనియాడారు. పత్రికాధిపతిగా ‘ఉదయం’ దినపత్రికను నిర్వహించిన విధానం, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం మరువలేనివన్నారు. దాసరి ఏ రంగంలో ఉన్నా తాను దర్శకుడిని అని చెప్పుకోవడాన్నే గౌరవంగా భావించేవారని గుర్తుచేశారు. ఓ దర్శకుడిగానే కాకుండా తెలుగు సినీ కుటుంబానికి పెద్దగా దాసరి స్థానం సుస్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు.‘చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన ఇంటి తలుపు తడితే పరిష్కారం దొరుకుతుంది అనే భరోసా ఉండేది. తెలుగు సినిమా రంగం అంతా ఒక కుటుంబం, మన ఇంటి సమస్య మనమే చర్చించుకొని పరిష్కరించుకోవాలనేది ఆయన భావన. ఇప్పుడు మన తెలుగు సినిమాకి దాసరి నారాయణరావు లాంటి కుటుంబ పెద్దలు కావాలి. వారంతా దాసరి పంథాలో వెళ్లి తెలుగు సినిమా ఔన్నత్యాన్ని కాపాడాలి. ఆయన విధానాన్ని, చూపిన బాటని అనుసరించినప్పుడే ఘనమైన నివాళి ఇవ్వగలం’ అని జనసేనాని అభిప్రాయపడ్డారు.