అందరికి దళిత బంధు కోసం దీక్ష : ఈటల
హైదరాబాద్. ఆగస్టు 14,
ళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. 10 లక్షల రూపాయలను దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకొనే వెసులుబాటు కల్పించాలని సూచించారు. వాటి మీద కలెక్టర్, బ్యాంక్ మేనేజర్‌ల అజమాయిషీ తీసివేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు అందరికీ అందించకపోతే ఉద్యమం తప్పదని ఈటల హెచ్చరించారు. అందరికీ అందించకుండా చాటలో తవుడు పోసి కొట్లాట పెట్టినట్టు చేస్తే తానే దీక్షకు కూర్చుంటానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నేతల మధ్య మాటల, తూటాలు పేలుతున్నాయి. మంత్రి హరీష్, మాజీ మంత్రి ఈటల మధ్య మాటల వార్ ముగిసేలోపే మరో అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈటల రాజేందర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పదవులు రాగానే ఈటల తప్పుడు మార్గాలు అనుసరించారని.. అక్రమంగా ఆస్తులు, అంతస్తులు కూడబెట్టి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీపైనే కన్నేశాడని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. కేసీఆర్ అవకాశమిస్తే పాలిటిక్స్‌లో అంచెలంచెలుగా ఎదిగి చివరికి టీఆర్‌ఎస్ సర్కారుకే వ్యతిరేకంగా మాట్లాడారని సుమన్ అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని.. ఇతర పార్టీల నాయకులతో కుమ్మక్కై ప్రభుత్వంపై విమర్శలు చేశారని తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఎస్సీల భూములు ఈటల ఆక్రమించుకున్నాడని ఆయన ఆరోపించారు. అందుకే ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించారని సుమన్ పేర్కొన్నారు. ఉప ఎన్నికలో ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని.. అదే గెల్లు శ్రీనివాస్ గెలిస్తే నియోజకవర్గ ప్రజలందరికీ లాభమని సుమన్ చెప్పారు.