దేశమంతా హై అలెర్ట్
న్యూఢిల్లీ, ఆగస్టు 14,
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. పంద్రాగస్టు వేడుకలే లక్ష్యంగా ఢిల్లీలో ఉగ్రవాదులు భారీ అల్లర్లకు కుట్ర చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు, ఆర్మీ దేశవ్యాప్తంగా అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఢిల్లీ నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు భారీగా ఆయుధాలు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 55 సెమీ ఆటోమోటెడ్ పిస్టల్స్, 50 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు.ఆగస్టు 15 ఆదివారం ఎర్రకోటలో ప్రధానమంత్రి మోదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండావిష్కరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎర్రకోట వద్ద 5 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఎత్తైన భవనాలపై ఎన్‌ఎస్‌జీ, స్వాత్ కమాండోలు, కైట్ క్యాచర్స్, షార్ప్ షూటర్లు పహారా కాస్తున్నారు. ఆగస్టు 15న డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగురవేయడంపై నిషేధం విధించారు. యాంటీ డ్రోన్ల వ్యవస్థలను సైతం పోలీసులు ఏర్పాటు చేశారు.