విజయవాడ, ఆగస్టు 16,
ఆర్ధిక మంత్రిని చూశారు, రేవిన్యూ మంత్రిని కూడా చూశారు. ఆ శాఖల పేర్లు చూస్తే చాలు వారేమి పనిచేస్తారో చెబుతాయి. కానీ అప్పుల శాఖ మంత్రిట. అదేంటి దేశాన ఇలాంటి శాఖ ఒకటి ఉంటుందా అంటే ఉంది అంటున్నాయి విపక్షాలు. ఏపీలో ఆ శాఖను చూస్తున్న వారే బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి. జగన్ ఈ శాఖను ఎవరికీ ఇవ్వలేదు కదా అంటే అవును ఆయన నిజానికి మంచి శాఖనే ఇచ్చారు. అది చివరకు అలా తయారైందిట. మామూలుగా ఆలోచిస్తే ఆర్ధిక మంత్రి కడు బలవంతుడు కూడా. రాష్ట్రాలలో చూసుకుంటే ముఖ్యమంత్రి తరువాత స్థానంలో ఉంటారు. కానీ అదేంటి ఖర్మమో కానీ కనీసం మంత్రిగా కూడా బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఆనందాన్ని హోదాని అసలు అనుభవించలేకపోతున్నారుట. ఆయన శాఖ పూర్తిగా అప్పులతో నిండిపోయింది. దాంతో ఆయన కూడా అప్పుల మంత్రిగానే ఉంటున్నారు అని ప్రతిపక్షాలు ఎకసెక్కమాడుతున్నాయి.ఢిల్లీకి ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు జరిగితే వస్తారు. పనుంటే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పెట్టుకుంటారు. కానీ బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి కి మాత్రం హస్తిన ఆయాసం తప్పడంలేదుట. మరీ ముఖ్యంగా గత ఏడాదిన్నరగా ఆ టూర్లు బాగా ఎక్కువయ్యాయట. బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అదే పనిగా ఏపీ టూ ఢిల్లీ అంటూ చక్కర్లు కొడుతున్నారుట. ఆయన ప్రతీ వారం ఢిల్లీలో కనిపిస్తారట. అదేంటి ఆయన ఉంటే తన సొంత జిల్లా కర్నూల్ లో ఉండాలి. లేకపోతే అమరావతి సచివాలయంలో ఉండాలి కదా. అది మామూలు ఆర్ధిక మంత్రులకు, కానీ బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిది భారమైన ఏపీ ఆర్ధికాన్ని మోసే బాధ్యత. అందువల్ల ఆయన ప్రతీ మంగళవారం ఢిల్లీకి వెళ్ళి బాండ్ల వేలం లో పాలుపంచుకుంటారుట. ఏపీకి వారానికి వేయి కోట్ల వంతున అప్పులు తెచ్చే బాధ్యతను ఆయన స్వీకరించారుట.ఇక బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి పని ఎలా తయారైంది అంటే ఢిల్లీలో ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా మారిందట. ఆయన కలసినన్ని సార్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని బీజేపీ మంత్రులు కూడా కలవలేదుట. ఆమెను కలసి విన్నపాలు చేసుకోవడమే బుగ్గన పనిగా మారింది. అంతే కాదు, ఏపీకి ఏ ఏ శాఖల వద్ద ఎన్నెన్ని నిధులు రావాల్సి ఉన్నాయో పెద్ద లిస్ట్ పట్టుకుని అయా కేంద్ర మంత్రుల వద్దకు పరుగులు పెట్టడమే బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి మెయిన్ డ్యూటీ అయిపోయిందిట. ఇక అప్పులు ఎక్కడైనా కొత్తగా దొరుకుతాయా అన్నది కూడా చూసే బాధ్యత ఆయనదేనట.బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి కొంతకాలంగా ఎవరికీ కనబడడంలేదు, మీడియాకు దూరం అంటే ఆయన ఏమైనా అలిగారేమో అనుకున్నారు. కానీ ఆయన మాత్రం అప్పులు కొత్తగా సంపాదించడం ఎలా అన్న సబ్జెక్టు మీద బాగా స్టడీ చేస్తున్నారని తెలుసుకుని అంతా షాక్ తింటున్నారు. ఇక బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఇంతకాలం సీక్రెట్ గా చేసుకువస్తున్నా ఏపీలో ముదిరిన రాజకీయం మూలంగా వైసీపీ మీద బురద జల్లేందుకు విపక్షాలు బుగ్గనను అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆయన్ని అప్పుల మంత్రిని చేసేశారు. దాంతో బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి మనసు పూర్తిగా విరిగిపోయిందట. అసలే ఆర్ధిక శాఖ మంత్రిగా రెండేళ్ళుగా కిందా మీదా పడుతూంటే ఇపుడు అప్పుల మంత్రి అంటూ పరువు తీస్తున్నారు అంటూ ఆయన గుస్సా అవుతున్నారుట. మొత్తానికి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఈ రకమైన శాఖను నిర్వహిస్తాను అని కలలో కూడా అసలు అనుకోరు అని ఆయన ప్రత్యర్ధులు కూడా బాధపడే స్థితి వచ్చింది మరి.