న్యూఢిల్లీ, ఆగస్టు 16,
సీఎం వైఎస్ జగన్ పదవి చేపట్టి రెండేళ్ళే దాటింది. పరిపాలన అనుభవం కూడా పెద్దగా లేదనే చెప్పాలి. ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా అంతకుముందు ఐదేళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా మాత్రమే ఉన్నారు. అయితే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించి జనహృదయ నేత గా తనువు చాలించిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కావడమే జగన్ రాజకీయ అడుగు కు ప్రధాన కారణం. అలాంటి యువనేత ఎన్నికలకు ముందు పాదయాత్రలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే ఏకైక ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నా లెక్క చేయకుండా మొండిగా ధైర్యంగా జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చుకుంటూ పోతున్నారు. వేలకోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకే చేరేలా జగన్ అందేలా చేస్తున్నారు.రూపాయి ప్రభుత్వం ప్రజలకు ఖర్చు పెడితే చివరికి కిందకు చేరేది ఐదుపైసలే అని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గతంలో చెప్పారు. అందుకే ఏ సర్కార్ సంక్షేమ కార్యక్రమం అమలు చేసినా అధికారులకు పండగగా మారేది. లబ్ది దారులకు మాత్రం ఒరిగేది ఏమి ఉండేది కాదు. ఇది గమనించిన జగన్ మధ్యలో ఎలాంటి దళారి లేకుండా సాంకేతికతను అందిపుచ్చుకుని నేరుగా లబ్ది దారు అకౌంట్ లోకి నిర్దేశిత సొమ్ములు చేరేలా విధానం అమలు చేస్తూ అందరి ప్రసంశలు అందుకుంటున్నారు.ఇప్పుడు ఇదే విధానం అధ్యయనం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా పిఎం కిసాన్ యోజనా పథకం లబ్ది దారులైన 9 కోట్ల 75 లక్షల మంది లబ్దిదారులైన రైతులకు సొమ్ములు నేరుగా వారి అకౌంట్ లోకి డబ్బు బదిలీ చేశారు. ఇకపై కేంద్ర సంక్షేమ పథకాలు ఇదే మార్గంలో లబ్ది దారులకు అందే కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి. మొత్తానికి జగన్ రూట్ వచ్చే ఎన్నికల నాటికీ దేశంలో పాలకులు మరింతమంది అమలు చేసేలాగే కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.