ముంబై, ఆగస్టు 16,
లాక్‌డౌన్లు, రిస్ట్రిక్షన్ల వల్ల కనీసం అద్దెలు కట్టలేని పరిస్థితులు ఎదుర్కొన్న మాల్స్‌లోని షాపులు, షోరూమ్‌లు ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నాయి. వీటి బిజినెస్‌లు కరోనా ముందు నాటికి స్థాయిలకు చేరుకుంటున్నాయి. ఢిల్లీ మొదలుకొని బెంగళూరు వరకు.. అన్ని సిటీల్లోని మాల్స్ షటర్లు తెరుచుకుంటున్నాయి. ప్రి–కరోనా బిజినెస్‌తో పోలిస్తే ఇప్పుడు బిజినెస్ విలువ 80 శాతం ఉంటోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. జనం రాకపోకలు విపరీతంగా పెరగడంతో రిస్ట్రిక్షన్లు కూడా పెడుతున్నారు. ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ వంటి మాల్స్ జనం రద్దీ పెరగ్గానే, గేట్లు మూసేస్తున్నాయి. ముఖ్యంగా వీకెండ్స్ పీక్ అవర్స్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీపావళి వరకు కరోనా థర్డ్ వేవ్ రాకుంటేనే, తాము కష్టాల నుంచి బయటపడతామని షాపుల యజమానులు అంటున్నారు. లేకపోతే మళ్లీ కష్టాల్లో చిక్కుకుంటామని చెబుతున్నారు. ఫస్ట్‌వేవ్ తరువాత అన్‌లాక్ కాలంతో పోలిస్తే ప్రస్తుత అన్‌లాక్‌లో కస్టమర్ల రాకపోకలు రెట్టింపయ్యాయని, రోజూ దాదాపు 10 వేల మంది వస్తున్నారని బ్రిగేడ్ గ్రూపుకి చెందిన నిరూపా శంకర్ అన్నారు. బెంగళూరులో బ్రిగేడ్ రెండు మాల్స్‌ను నడుపుతోంది. ప్రీకోవిడ్ బిజినెస్‌తో పోలిస్తే ప్రస్తుత బిజినెస్ 90 శాతం వరకు ఉందని వివరించారు. అయితే ఫస్ట్ వేవ్‌లో కస్టమర్ల సంఖ్య కరోనాకు ముందుకాలంతో పోలిస్తే 60 శాతం తక్కువగా ఉండేది. ప్రస్తుత పండగ సీజన్ సొమ్ము చేసుకోవడానికి మాల్స్, షాపులు, బ్రాండ్లు 50 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మామూలుగా మాల్స్ ఏడాది బిజినెస్‌లో 40 శాతం వరకు ఫెస్టివల్ సీజన్ నుంచే వస్తోంది. కరోనా నష్టాల నుంచి బయటపడాలంటే పండగ అమ్మకాలు బాగుండాలని మాల్ ఆపరేటర్లు చెబుతున్నారు. ‘‘రాబోయే నెలల్లో ఇలాంటి అడ్డంకులు రాకూడదని కోరుకోవడం ఒక్కటే మనం చేయగలిగిన పని. వచ్చే నెల థర్డ్ వేవ్ వస్తే మాత్రం బిజినెస్‌లు మునిగినట్టే!’’ అని ఎథ్నిక్‌వేర్ బ్రాండ్ బిబా ఎండీ సిద్ధార్థ్ బింద్రా చెప్పారు. తమ కంపెనీకి ప్రస్తుతం ఢిల్లీలో 70 శాతం వరకు, చెన్నైలో 60 శాతం వరకు రికవరీ రేటు ఉందని ఆయన వివరించారు.కొన్ని సిటీల్లో ప్రభుత్వాలు ఇప్పటికీ రిస్ట్రిక్షన్లను అమలు చేస్తున్నాయి. మిగతా నగరాల్లో పరిస్థితి బాగానే ఉన్నా మహారాష్ట్రలో మాత్రం మాల్స్ షటర్లు ఇప్పటికీ తెరుచుకోలేదు. దీనివల్ల ప్రతి నెలా రూ.40 కోట్ల నష్టం వస్తోందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ విషయం గురించి మహారాష్ట్ర గవర్నమెంటు ఒక ప్రకటన చేసింది. పంద్రాగస్టు నుంచి మాల్స్ తెరుచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చింది. ఢిల్లీలో మాల్స్‌ను ఎనిమిదింటికే మూసేయాలని ఆదేశాలు ఉన్నాయి. కరోనా రాక ముందు షాపులను రాత్రి 11 గంటల దాకా నడిపేవారు. ఓపెన్ సిట్టింగ్ ఏరియాలు ఉన్న కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, రెస్టారెంట్లలో జనం ఎక్కువగా కనిపిస్తున్నారని మాల్ ఆపరేటర్లు చెబుతున్నారు. కస్టమర్లు ఎక్కువగా గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అంటున్నారు. ‘‘వీకెండ్స్‌లో ప్రతి పావు గంటకు ఒకసారి గేట్లు మూస్తున్నాం. ఈ సమయంలో కనీసం 15 కార్లు మాల్ నుంచి వెళ్లిపోతాయి కాబట్టి కొత్తగా కొంతమంది లోపలికి రాగలుగుతారు’’ అని సెలెక్ట్ సిటీవాక్ సీఈఓ చెప్పారు.