గుంటూరు
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై మావోలు ఘాటైన వ్యాఖ్యలు చేసారు. కనీస సామాజిక అవగాహన, చారిత్రక వాస్తవాలు చూడలేని గౌతమ్ సవాంగ్ ను డీజీపీగా నియమించడం దౌర్భాగ్యం. సవాంగ్ ను డీజీపీగా కంటే వైసీపీ కార్యకర్తగా చేర్చుకుంటే మేలని ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ అన్నారు. ఏఓబీలో మావోయిస్టులు ఉనికి కోల్పోతున్నరన్న గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలను మావోలు ఖండించారు. నిజంగా ప్రజలకు సమస్యలే లేనప్పుడు ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీలే ఎందుకు బహిష్కరించారని అయన ప్రశ్నించారు. మావోయిస్టుల ఉనికే లేనప్పుడు వేలాది బలగాలను మన్యంలోకి ఎందుకు పంపి కూంబింగ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున క్యాంపులు పెట్టి ఎందుకు అక్రమ అరెస్టులు, ప్రజలపై దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ఏఓబీలో ఉద్యమం బలహీనపడిన మాట వాస్తమే. కానీ తాము మళ్ళీ పుంజుకుని గెలిచి తీరుతామని అన్నారు. స్టీల్ ప్లాంటు ఉద్యమానికి తాము మద్దతు ఇస్తేనే డీజీపీ ఉలిక్కిపడుతున్నారు. తమ పార్టీ కేవలం మద్దతుతోనే ఆగదు, విజయం సాధించే దిశగా నాయకత్వం అందిస్తుంది. ఏపీలో అంగన్వాడీలు, ప్రాధమిక పాఠశాలల విలీనం, నూతన విద్యావిధానం వంటి ప్రజావ్యతిరేక విధానాల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మన్యంలో విలువైన సంపద, బాక్సైట్ తరలింపుపై ఆదివాసీలు, ప్రజలు పోరాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. మీడియా, ప్రతిపక్షం, ప్రజాసంఘాలకు కనీస భావప్రకటనా స్వేచ్చ లేకుండా లేదు. ఏపీలో అత్యంత క్రూరమైన నిర్భందాన్ని అమలు చేస్తూ నియంత పాలన కొనసాగిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టు సుదీర్ నైతికంగా పతనమై మరో సభ్యురాలైన మహితను తీసుకొని పారిపోయాడని గణేశ్ అన్నారు.