విధులకు స్వస్తి చెప్పి పదవి విరమణ చేసి ప్రజల్లోకి వచ్చిన సిబిఐ మాజీ జెడి లక్ష్మి నారాయణ అడుగులు ఎటువైపు అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా బయల్దేరింది. లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారని తొలుత చాలామంది భావించారు. కానీ అందరి ఆలోచనలకు భిన్నంగా ఆయన వివిధ వర్గాల ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలతో మమేకం అవుతున్నారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై ఆయన బాగా ఫోకస్ పెట్టారు. విభిన్న కార్యక్రమాలను డిజైన్ చేస్తూ కార్యాచరణ రూపొందించుకుని అమలు చేస్తున్నారు.జెడి లక్ష్మీనారాయణ రాబోయే ఎన్నికల్లో కొత్త పార్టీ పెడతారా ? లేక ప్రస్తుతం ఉన్న ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో చేరతారా ? ఈ ప్రశ్నలు ఇప్పడు ఊహాజనితంగా మారాయి. లక్ష్మీనారాయణ ఇప్పుడు చేస్తున్న అరంగేట్రం అంతా రాబోయే రోజుల్లో రాజకీయ తెరపైకి దూసుకువెళ్ళే కార్యక్రమాలని చెప్పక చెబుతున్నాయి. ఆయన ఏ పార్టీలో చేరకుండా ఉండిపోతే ఎదో ఒక పార్టీకి ఎన్నికలు దగ్గరకు వచ్చాక మద్దతు ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. గుంటూరు జిల్లాలో, ఉత్తరాంధ్ర పర్యటనల ద్వారా లక్ష్మినారాయణ వినూత్న కార్యక్రమాలే నిర్వహించారు. మరి ఈ కార్యక్రమాల ప్రతిఫలాన్ని త్వరలోనే లక్ష్మినారాయణ ఆశిస్తారని చెబుతున్నారు.2019 ఎన్నికల్లో తటస్థ ఓట్లను చీల్చేలా మాజీ జెడి స్కెచ్ వేశారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి వారి అంచనాలు నిజం అవుతాయో లేదో కాలమే చెప్పాలి.