నల్గొండ, ఆగస్టు 16,
మూసీ ప్రాజెక్టు ఇప్పటికే నిండింది. 30 సంవత్సరాల తర్వాత వానకాలం పంటలకు మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో మూసీ కుడి, ఎడమ కాల్వ నుంచి సాగు నీరు విడుదల చేశారు. మూడు దశాబ్ధాల తర్వాత మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో వానకాలం పంటలకు ఎడమ, కుడి కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడంతో నేడు ఆయకట్టు రైతులు సుమారు 25వేల ఎకరాలు సాగు చేస్తున్నారు. కాల్వల ద్వారా నీళ్లు రావడంతో కాల్వ కింద ఉన్న పిన్నాయిపాలెం, పిల్లలమర్రి చెరువులు నిండి చెరువు కింద ఉన్న బావులు, బోర్లతోపాటు భూగర్భ జాలాలు పెరుగుతున్నాయని రైతుల చెబుతున్నారు. ఇప్పటికే రైతులు పొలాలు దున్ని వరినాట్లు వేసేందుకు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతకు మునుపు వానకాలం పంటలకు మూసీ నీళ్లు లేక బావులు, బోర్లతో తక్కువ మొత్తంలో సాగు చేసేవారుదీంతో మూసీ ఆయకట్టు కింద ఉన్న రైతాంగం వరినాట్లు వేసేందుకు పొలాలు దున్నుతూ బిజీగా ఉన్నారు. సాగునీరు పుష్కలంగా ఉండటంతో రైతులు మురిసిపోతున్నారు. గతంలో వానకాలం పంటలకు సాగునీరు లేక మూసీ ఆయకట్టు రైతులు బావులు, బోర్ల మీద ఆధారపడి కేవలం ఎడమ కాల్వ కింద 5వేల ఎకరాలు మాత్రమే సాగు చేశారు. నీళ్లు లేకపోవడంతో రైతులు పంట పొలాలను బీళ్లుగా ఉంచారు. అందుకు కారణం మూసీ ప్రాజెక్టు గేట్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రాజెక్టులో నీళ్లు నిలువకుండా గేట్ల నుంచి నీరు వృథాగా పోయి కృష్ణా డెల్టాలో కలిపొవడంతో వానకాలం పంటలకు సాగు నీరవ్వలేని పరిస్థితి నెలకొంది. మూసీ ఆయకట్టు కింద ఉన్న రైతులకు వానకాలం పంటలకు కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మంత్రి జగదీష్‌రెడ్డి సూమారు రూ. 19 కోట్లతో మూసీ ప్రాజెక్టు గేట్లను మరమ్మతులు చేయించడంతో ప్రాజెక్టులోకి వచ్చిన ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టడంతో నేడు మూసీ ప్రాజెక్టు నిండి జలకళను సంతరించుకుంది. నేడు వానాకాలం పంటలకు మూసీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడంతో ఎక్కువ మొత్తంలో సాగు చేసుకుంటున్నామని రైతులు ఆనందం వ్యక్త చేస్తున్నారు. వానాకాలం పంటలకు మూసీ ప్రాజెక్టు నుంచి ఏ ప్రభుత్వాలు నీటిని విడుదల చేయలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వానాకాలం పంటలకు సాగు నీళ్లను విడుదల చేయడంతో నాకున్న 3 ఎకరాలను సాగు చేస్తున్నా. ప్రభుత్వం అందించిన పంట పెట్టుబడి ఈ పంటలకు ఎంతో ఉపయోగపడింది.