YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఆందోళనలో కాంట్రార్ట్ అధ్యాపకులు

ఆందోళనలో కాంట్రార్ట్ అధ్యాపకులు

నల్గొండ, ఆగస్టు 16, 
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా మారింది. జూన్‌, జులై రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు. కొన్ని జిల్లాల్లో గత విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫిబ్రవరి, మార్చి జీతాలూ రాలేదు. కరోనా, ఇతర రోగాల బారిన పడిన వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉన్నది. వైద్య ఖర్చులకూ డబ్బుల్లేక నానా తిప్పలు పడుతున్నారు. ఇంకోవైపు ప్రతినెలా బ్యాంకులకు ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక పిల్లల చదువులకు ఫీజులు, ఇంటి అద్దె చెల్లించేందుకు డబ్బుల్లేక కుటుంబాల పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు గడవడం కోసం గత్యంతరం లేక ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయాల్సి వస్తున్నదని పలువురు అధ్యాపకులు వాపోతున్నారు. సకాలంలో జీతాలు రాకుండా ఎలా బతకాలనీ, కుటుంబాలను ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు. రెగ్యులరైజేషన్‌ హామీ అమలు కాక, బదిలీలు చేయక, కనీసం ప్రతినెలా జీతాలు రాక కుంగిపోతున్నారు. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సుమారు 3,600 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరం జులై ఒకటి నుంచి ప్రారంభమైంది. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు జరుగుతున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులు రోజూ కాలేజీలకు హాజరవుతున్నారు. కానీ కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యూవల్‌ ఉత్తర్వులు ఇంత వరకు విడుదల కాలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు జీతాలు రాక, ఇంకోవైపు రెన్యూవల్‌ ఉత్తర్వులు విడుదల చేయకుండా ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో లక్ష అడ్మిషన్లు దాటాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకెళ్లి ప్రభుత్వ కాలేజీల్లో చేరేలా కృషి చేయడంలో కాంట్రాక్టు అధ్యాపకుల పాత్ర కీలకంగా మారింది. ప్రభుత్వ కాలేజీల బలోపేతానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. అయినా వారి పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది. చేసేది అధ్యాపక వృత్తి జీతాలు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనీ, ప్రతినెలా జీతాలు విడుదల చేయాలని కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రతినెలా జీతాలివ్వాలని ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (జీసీసీఎస్‌ఏ-475) అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌, అధికార ప్రతినిధి సయ్యద్‌ జబీ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. రెండు నెలలుగా జీతాలు రాక కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కావడం లేదని తెలిపారు. ప్రతినెలా జీతాలిస్తామంటూ అధికారులు మాటలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో లక్ష అడ్మిషన్లు దాటాయని వివరించారు. కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మాత్రం తీరని అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఏటా మేలోనే రెన్యూవల్‌ ఉత్తర్వులు వచ్చేవనీ, ఈ విద్యాసంవత్సరంలో ఆగస్టు నాటికీ రాలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలే అమలు కాకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలు చేపట్టాలని సీఎం ఆదేశించి తొమ్మిది నెలలైనా ఆ ప్రక్రియను చేపట్టకపోవడం బాధాకరమని తెలిపారు. కొత్త జోనల్‌ విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తమ పిల్లలకు స్థానికత ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అధ్యాపక ఖాళీలున్నా బదిలీలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. ఆర్థిక భారం లేని బదిలీలను తక్షణమే చేపట్టాలని సీఎంను కోరారు. తమను రెన్యూవల్‌ చేయలేదనీ, మూడు నెలలుగా జీతాలు రాలేదని తెలిపారు.

Related Posts