గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, టవళ్లు, పౌష్టికాహారం పంపిణీ
నెల్లూరు
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్వతంత్ర పార్కులో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి 100 మంది నిరుపేదలకు దుప్పట్లు, టవళ్ళు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక బృందావనం ప్రాంతంలో ఉన్న విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి. హజరత్ కుమార్, వాయ గుండ్ల ఖాజాశెట్టి చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ కె. విజేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ తోట జనార్ధన్ వారి ధర్మపత్ని తోట కమలాంబ జ్ఞాపకార్థం వారి కుమార్తె అన్నపూర్ణ సౌజన్యంతో నిరుపేదలకు దుప్పట్లు, టవళ్లు, పౌష్టికాహారం ప్యాకెట్లు పంపిణీ చేయడం హర్షణీయం అన్నారు. గౌతమ బుద్ధ చారిటబుల్ ట్రస్ట్ సేవలు దినదినాభివృద్ధి చెంది మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అరవ జయ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి అరవ రాయప్ప మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగ ఫలమే భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణమని వారందరికీ భారత దేశ ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని స్వాతంత్ర సమరయోధుల సేవలను కొనియాడారు. గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ప్రారంభము నుండి వృద్ధులు, వికలాంగులు, అనాధలు, వితంతు మహిళలతో పాటు ఆసరా కోల్పోయిన మరెంతో మందికి తమ వంతు బాధ్యతగా చేయూత నివ్వడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అసోసియేషన్కు అనేకమంది దాతల సహకారం అందించడంతో వివిధ సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మనసున్న దాతలు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వృద్ధుల, వికలాంగుల, అనాధల ఆశ్రమాలకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిట్టి సత్య నాగేశ్వరరావు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.